త‌మ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధ‌రాత్రివేళ కిరాత‌కంగా మారిన అన్న.. | Sakshi
Sakshi News home page

త‌మ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధ‌రాత్రివేళ కిరాత‌కంగా మారిన అన్న..

Published Sat, Dec 9 2023 12:10 AM

- - Sakshi

సాక్షి, అనంతపురం: శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామానికి చెందిన గొల్ల కృష్ణమూర్తి(27) సొంత అన్న చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఈ హత్యకు దారితీయడం గమనార్హం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామానికి చెందిన గొల్ల గోపాల్‌, మల్లక్క దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు గొల్ల రవి, రెండో కుమారుడు కృష్ణమూర్తి, కుమార్తె భారతి ఉన్నారు.

కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు పడేవారు. వెంటనే కలసిపోయేవారు. గురువారం ఉదయం పెద్ద కుమారుడైన రవి తన తమ్ముడి సెల్‌ఫోన్‌ను చెప్పకుండా తీసుకుని కళ్యాణదుర్గం వెళ్లాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు కృష్ణమూర్తి కళ్యాణదుర్గం వెళ్లి.. సెల్‌ఫోన్‌ ఇవ్వాలంటూ అన్నతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే రాయితీసుకుని అన్న తలపై కొట్టడంతో స్వల్ప గాయమైంది.

స్థానికులు గమనించి ఇద్దరినీ దండించడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడిన రవిని తమ్ముడు కృష్ణమూర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తర్వాత ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంలో ఇంటికి చేరుకున్నారు. అయితే తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న రవి గురువారం అర్ధరాత్రి ఒకే ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడిని గొడ్డలితో విచక్షణరహితంగా నరికి చంపాడు.

శుక్రవారం ఉదయం ఇంట్లోకి వచ్చిన తల్లి మల్లక్క రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి కేకలు వేసింది. హత్య విషయం తెలుసుకొన్న గ్రామస్తులు నివ్వెరపోయారు. కళ్యాణదుర్గం సీఐ నాగరాజు, బ్రహ్మసముద్రం ఎస్‌ఐ పరుశురాముడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా..నిందితుడు రవి శెట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.

తల్లడిల్లిన తల్లిదండ్రులు..
కృష్ణమూర్తి హత్యతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబ భారమంతా తనే మోసేవాడు. తన సంపాదనతోనే చెల్లి పెళ్లి కూడా చేశాడు. తండ్రి గోపాల్‌కు మతిస్థిమితం లేదు. అన్న రవి కుటుంబ బాధ్యతలు పట్టించుకునేవాడు కాదు. కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుమారుడు దారుణ హత్యకు గురికావడం, మరో కుమారుడు నిందితుడిగా జైలుపాలు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.
ఇవి చ‌ద‌వండి: సైకో కిల్లర్‌ అరెస్టు

Advertisement
 
Advertisement