తుమ్మపాల: పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, ప్లాస్టిక్ రహిత వాతావరణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్‘ కార్యక్రమంపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యాసంస్థలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ లక్ష్యాలను సమర్ధంగా అమలు చేసి, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలన్నారు. శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు సమావేశానికి ముందుగానే తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కా ర్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ సరిగా జరుగుతోందా అనే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పొదలు, కలుపు మొక్కలు పెరగకుండా, విష జంతువులు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే నెల 14 లోగా నీటిపారుదల పనులు పూర్తవ్వాలి
తుమ్మపాల: నీటిపారుదల కాలువల నిర్మాణం, పూడికతీత పనులను ఆగస్టు 14 లోగా పూర్తి చేయడంతో పాటు సిమెంట్ లైనింగ్, కాలువల మరమ్మతులు, వాగుల మళ్లింపు వంటి ప్రతి పనికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. ఎర్త్‌వర్క్, కాలువ తవ్వకం పనులు ప్రతిపాదించిన రూ.30.93 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనుల్లో మెజారిటీ పనులు పూర్తయినందున, మిగిలిన ఎంబ్యాంక్మెంట్, క్లియరెన్స్ పనులను ఆగస్టు 10వ తేదీ నాటికి ముగించాలన్నారు. స్ట్రక్చర్ల పనులను వచ్చే గురువారం నాటికి పూర్తి చేసి నివేదించాలని జిల్లా పరిధిలోని 31 కిలోమీటర్ల వైఎల్‌ఎంసీ కాలువ పరిధిలో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. తాండవ ప్రాజెక్ట్‌లో 3.65 టీఎంసీల నీటి నిల్వ ఉందని, సుమారు 32వేల ఎకరాల ఆయకట్టుకు నెల రోజుల్లో నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైవాడ రిజర్వాయర్లో ప్రస్తుతం 1.16 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 15వేల ఎకరాల సాగునీటితో పాటు, జీవీఎంసీ తాగునీటి అవసరాలకు (రోజుకు 50 క్యూసెక్కులు) పంపిణీ జరిగేలా అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కింద సాగునీరు అందుతున్నందున నీటి పన్ను అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఎస్.రాయవరం మండలంలో 89 మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తికావడం, నర్సీపట్నం, కోటవురట్ల, దేవరాపల్లి, కోటపాడు మండలాల్లో పనులు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లోని పెండింగ్ కాలువ మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గడువులోగా గ్రామీణాభివృద్ధి పనులు
తుమ్మపాల: పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణం వంటి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గంలో పనుల పురోగతి మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 నుంచి 14 నెలలు గడిచినా పనులు పూర్తికాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు, ఆక్రమణలు లేదా స్థల వివాదాల కారణంగా నిలిచి పోయిన పనులను ఐదు నుంచి పది రోజుల్లోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నిర్మా ణ వ్యయం లేదా కాంట్రాక్టర్ల సమస్యలతో ఆలస్యమవుతున్న బీటీ రోడ్లను అవసరమైన చోట సీసీ రోడ్లుగా మార్చి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లుల సమస్య లను కూడా వెంటనే పరిష్కరించి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


