కంచరపాలెం: చెక్ బౌన్స్ కేసులో నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఎస్‌బీఐ మాజీ ఉద్యోగి గల్లా రాజశేఖర్‌ను కంచరపాలెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ 2వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సీసీ నం.21/2021 కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఎన్‌బీడబ్ల్యూ మేరకు ఆయనను అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం విజయవాడకు తరలించారు. ఫిర్యాదుదారు ముత్యాల సురేష్ ఆరోపణల ప్రకారం, గల్లా రాజశేఖర్ తన ఇంటర్మీడియట్ సహపాఠి అయిన ఎన్‌ఆర్‌ఐ ముత్యాల సురేష్‌ను విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించి సుమారు రూ.కోటి తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా మోసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాక తనపై తప్పుడు కేసులు నమోదు చేయించే ప్రయత్నం కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధుల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో గల్లా రాజశేఖర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుని ఎస్‌బీఐ సేవల నుంచి తొలగించినట్లు సమాచారం. ఆయనపై మరిన్ని ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయని ఫిర్యాదుదారు తెలిపారు.


