వంతెన సంగతి మరిచారా? | - | Sakshi
Sakshi News home page

వంతెన సంగతి మరిచారా?

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

భూమి పూజకు 17 నెలలు..నిర్మాణానికి ఇంకెన్నేళ్లు?

నర్సీపట్నం– తుని మధ్య వెదుళ్ల గెడ్డపై కలగానే వంతెన నిర్మాణం

తాండవ ఉప్పొంగితే రెండు జిల్లాల రాకపోకలు బంద్‌

గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా కాంట్రాక్టరు నిర్వాకంతో జరగని పనులు

మరల రీశాంక్షన్‌తో పనులకు భూమి పూజ చేసిన స్పీకర్‌, కలెక్టరు

రోడ్డు విస్తరణ చేసి వంతెన పనులు మరిచిన వైనం

ఆర్భాటమేనా..?

కూటమి ప్రభుత్వం ఆర్భాటమే తప్ప దానికి తగట్టుగా పనులు చేయడం లేదు. మమ్మల్ని విమర్శించారు. ఇపుడు మీరు చేసిందేంటి? స్పీకరు అయ్యన్న పాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్‌ స్వయంగా భూమి పూజ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా వంతెన పనులు మొదలు కాలేదు. దీనిని బట్టి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది.

– సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ నాతవరం మండలం

రెండేళ్లయినా అభివృద్ధి ఊసు లేదు..

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు కంటే రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టింది. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేసిన పనులే ఈ విధంగా జరుగుతుంటే..మిగిలిన అభివృద్ధి పనుల మాటేమిటో?

–లగుడు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌, వైఎస్సాన్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు

నాతవరం : ఆర్భాటంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.. కానీ వంతెన నిర్మాణం పనులు మరిచారు. ఈ రోడ్డు పనులకు స్వయంగా అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్‌ 2024 నవంబరులో భూమి పూజ చేశారు. కానీ ఏడాదిన్నర గడిచినా వంతెన నిర్మాణం ఊసేలేదు. మండలంలో నర్సీపట్నం–తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద అర్‌అండ్‌ రోడ్డుపై వెదుళ్లుగెడ్డ ప్రతి ఏటా వర్షాలు సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. గతంలో ఇక్కడ వెదుళ్లుగెడ్డ నీటి ఉధృతికి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో అర్‌అండ్‌బీ రోడ్డుపై వెర్రిగెడ్డ నీటి ప్రవాహాన్ని అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై వెదుళ్లు గెడ్డనీరు ప్రవాహంతో ఈ చుట్టుపక్కల గ్రామాలు వైబీ అగ్రహారం, గన్నవరం మెట్ట నీటి ముంపునకు గురికావడం, ఈ ప్రాంతీయులు బాధలు ఆయన చూశారు. ఈ సమస్యను అప్పటి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లు గెడ్డపై వంతెన నిర్మాణం, శృంగవరం నుంచి 4 కిలోమీటర్లు కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.14 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో అప్పటి ఎమ్మెల్యే గణేష్‌ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ఎ.శరభవరం, శృంగవరం మధ్య భూసేకరణ చేశారు. పనులు ప్రారంభించి పూర్తి చేయకుండా బిల్లులు రావంటూ సాకు చెప్పి అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌ కాలయాపన చేశారు. ఆ పనులను మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీశాంక్షన్‌ చేశామంటూ 2024 నవంబరులో ఈ రోడ్డుకు స్పీకరు అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్‌ స్వయంగా భూమి పూజ చేశారు. అసంపూర్తిగా ఉన్న శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు మధ్య అర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు చేశారు. కానీ ఈ రోడ్డు మధ్యలో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. భూమి పూజ చేసి 17 నెలలు అవుతున్నా వంతెన పనులు ఊసెత్తలేదు. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేయడంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేస్తారు..ఏళ్ల నాటి సమస్య తీరుతుందని ఈ ప్రాంతీయలు ఆశించారు. కానీ వంతెన నిర్మాణం చేయకపోవడంతో ఈ ఏడాది కూడా వర్షాలు, తుఫాన్లు సమయంలో వెదుళ్లుగెడ్డ నీటి కష్టాలు తప్పవంటున్నారు. తాండవ ప్రాజెక్టు నుంచి స్పిల్‌వే గేట్లు ఎత్తినా, భారీ వర్షాలు కురిసినా వెదుళ్లుగెడ్డ రోడ్డుపై ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. నీటి ఉధృతి తగ్గేంత వరకు రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. రాత్రి వేళల్లో కొత్తగా వచ్చే వాహనదారులకు నీటి ఉధృతి తెలియక దిగేయడంతో పలువురు కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తుపానుల సమయంలో అధికారులు వెదుళ్లుగెడ్డ వద్ద కాపలా పెట్టి ప్రమాదాలు జరగకుండా పోలీసులు దగ్గరుండి వాహనాలు పంపిస్తూ జాగ్రత్తలు చేపడుతుంటారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా వంతెనలు నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టరు జాప్యమే కారణమన్నారు. ఈ సమస్య ఉన్నతాధికారులు దృష్టిలో ఉందన్నారు

Advertisement
 
Advertisement
Advertisement