కూటమి నేతల వత్తాసు! | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల వత్తాసు!

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

● డిస్మిస్‌ అయిన వ్యక్తికి మళ్లీ ఉద్యోగమిస్తే సహించం ● జానకీరాంపురం పీఏసీఎస్‌ బినామీ రుణ బాధితుల ఆందోళన

సొసైటీ రుణాలు కొల్లగొట్టిన సీఈవోకు

రోలుగుంట : జానకీరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కోట్లాది రూపాయలు రుణాలు దర్వినియోగానికి పాల్పడిన నేరంపై ఉన్నతాధికారులు ఆ సంఘ సీఈవోను విధుల నుంచి తొలగించారు. మళ్లీ అదే వ్యక్తికి కూటమి నాయకుల సిఫారసుతో అదే బ్యాంకులో విధుల్లో చేరే విధంగా తీర్మానం చేయడంపై బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు, రైతు సంఘ నాయకులు బుధవారం విలేకరులతో పీఏసీఎస్‌లో జరిగిన అవకతవకలు, బినామీ రుణ బాధితులు తమకు జరిగిన నష్టంపై మాట్లాడారు. సమారు నాలుగైదేళ్ల క్రితం కోట్లాది రూపాయలను పలు రకాల రుణాలు సభ్యులకు తెలియకుండా మంజూరు చేసి అప్పటి సీఈవో కృష్ణ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సొసైటీలో సభ్యులు కాని వారికి, స్థానికేతరులకు, భూమిలేని వారికి సుమారుగా 200 మంది పేరున రుణాలు మంజూరుకు పాల్పడ్డాడని కిల్లాడ సాంబమూర్తి నాయుడు, గొల్లు కల్పన, నారాయణరావు ఆరోపించారు. దీనిపై పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కల్టెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేసి, సీఈవోకు, అతనికి సహకరించిన గుమస్తాను తొలగిస్తూ సమారు ఎనిమిది మాసాల క్రితం డిస్మిస్‌ చేయడం జరిగింది. దీినిపై కోపోద్రిక్తుడైన సీఈవో రికార్డులను కాల్చేస్తానని పెట్రోలు తీసుకెళ్లి అధికారులను బెదిరించాడు. దీంతో ఇక్కడ అధికారుల ఫిర్యాదుతో అప్పటి సీఐ గోవిందరావు కేసు నమోదు చేసి విచారణానంతరం రిమాండుకు తరలించగా 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్నాడు.

విచారణ తూతూ మంత్రం?

అయితే రుణబాధితుల ఫిర్యాదును మాత్రం ఆ శాఖ అధికారులు తూతూ మంత్రంగానే విచారణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 51 చట్టం ప్రకారం విచారణ చేస్తామంటారు, ఎత్తేస్తారు.. ఇలా బాధితులతో ఆటలాడుకోవడం మినహా న్యాయం జరగలేదని చెబుతున్నారు. సుమారు రూ.నాలుగు కోట్ల నష్టంతో ఉన్న ఈ పీఏసీఎస్‌ ఇటీవల మడ్డు గణేష్‌ అనే సీఈవోతో నామమామత్రంగా నడుపుతున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ మండల నాయకుడు దొరబాబుని పర్సన్‌ ఇన్‌చార్జిగా, మరో ఇద్దరు డైరెక్టర్‌లతో నడుస్తుంది. ఈ పర్సన్‌ ఇన్‌చార్జితో డిస్మిస్‌ అర్డరు జారీ చేసి, ఇదే ఇన్‌చార్జితో మరలా విధుల్లో చేర్పించే తీర్మానం చేయడానికి పాలకవర్గం యత్నాన్ని, కూటమి ప్రభుత్వ తీరును బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విధుల నుంచి డిస్మిస్‌ అయి 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్న వ్యక్తికి మళ్లీ ఇదే పీఏసీఎస్‌లో ఉద్యోగమిస్తే, అతన్ని విధుల్లో చేరనివ్వబోమని, అలా జరిగితే వందలాది మందితో కలసి పీఏసీఎస్‌కు తాళం వేసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కూటమి నాయకులు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌ రాజు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి పి.వి.ఎస్‌.ఎన్‌ రాజును కలసి తమ ఉద్యమ నోటీసును అందజేయనున్నట్టు గ్రామ నాయకులు సబ్బవరపు పెద్దినాయుడు తదితరులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement