తుమ్మపాల : ప్రతి గ్రామ పంచాయతీలోను పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే పూర్తిగా తొలగించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ ఎంపీడీఓలు, పోలీస్, విద్యుత్, వైద్య, విద్య, రవాణా శాఖ అధికారులతో బుధవారం వెర్వేరుగా ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా వ్యర్థాలు లేకుండా సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. వ్యర్థాల తొలగింపు కోసం అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నిధులను సమకూర్చుకొని పనులను పురమాయించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లు ఏర్పాటు చేసి, చెత్త సేకరణ, రవాణా వంటి వ్యవస్థను మరింత సమర్ధంగా నిర్వహించాలన్నారు. అన్ని వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూసుకోవాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. ప్రతి ఇంటిలో సొంత మరుగుదొడ్లు ఉండేలా, వాటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, వసూళ్ల లక్ష్యాలను చేరుకుని జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 21 నుంచి జూన్ 04 వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వానన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కేంద్రంలోకి హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతింపబోమన్నారు. టాయిలెట్లు, వైద్య విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు పరిశీలన చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశిస్తూ సంబంధిత అధికారులను పరీక్షలు పారదర్శకంగా, జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు సమకూర్చాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి, డీఈవో అప్పారావునాయుడు, డీపీవో సందీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


