అందుబాటులో జనుము విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో జనుము విత్తనాలు

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి ఏడీఆర్‌ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్‌ చేయాలి. ఖరీఫ్‌కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్‌యూఐఎన్‌.037, జేఆర్‌జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్‌ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్‌, టెబుకోనజోల్‌ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్‌ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్‌ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్‌ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్‌ యూజినాల్‌, 3 గ్రా, కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్‌ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్‌.సరిత, వి.చంద్రశేఖర్‌, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement