అక్కరకు రాని అగ్రిల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

అక్కరకు రాని అగ్రిల్యాబ్‌లు

May 13 2026 12:50 AM | Updated on May 13 2026 12:50 AM

రైతన్నకు దూరమైన భూసార పరీక్షలు ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందే మట్టి నమూనాలు సేకరణ ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారిన మట్టి పరీక్షలు చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రి ల్యాబ్‌లు నిర్వీర్యం అందని నిధులు..సిబ్బంది కొరతతో అవస్థలు

సాక్షి, అనకాపల్లి : జిల్లాలోని అగ్రిల్యాబ్‌లు రైతులకు అక్కరకు రాకుండా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌ల్లో ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఖరీఫ్‌ సీజన్‌కు నెలకు ముందే భూసార పరీక్షలను చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనకాపల్లి జిల్లాలో గతే ఏడాది 25,052 పరీక్షలు చేసి రైతులకు ఫలితాల వివరాలు అందించారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో ఇంకా లక్ష్యమే నిర్దేశించుకోలేదు.అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, అల్లూరి జిల్లా అరకులో మాత్రమే అగ్రిల్యాబ్‌లు వినియోగంలో ఉన్నాయి. అది కూడా బయట జిల్లాల మట్టి నమూనాలను పరీక్షిస్తున్నారు.

నిర్లక్ష్యం నీడలో భూసార పరీక్షలు

సాధారణంగా మార్చి నుంచే మట్టి నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఏప్రిల్‌ నెలాఖరుకల్లా పరీక్షలు పూర్తి చేసి, మే మొదటి వారంలో ఫలితాలను రైతులకు అందించాలి. తద్వారా తమ భూమికి ఏ రకమైన ఎరువులు అవసరం, ఏ పంటలు వేస్తే దిగుబడి వస్తుందో రైతులకు ఒక అవగాహన ఉంటుంది. కానీ అనకాపల్లి జిల్లాలో మే రెండో వారం గడుస్తున్నా ఇప్పటివరకు లక్ష్యాలను కూడా నిర్దేశించకపోవడం గమనార్హం.

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం

భూమిలో సారం తగ్గడం, రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల నేల స్వభావం మారుతోంది. ఈ తరుణంలో సమగ్ర భూసార పరీక్షలు నిర్వహించకపోతే పంట దిగుబడి తగ్గడమే కాకుండా, చీడపీడల తాకిడి పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత ప్రభుత్వంలో మేలైన సేవలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్‌ చొప్పున ఏర్పాటు చేశారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలో అగ్రిల్యాబ్‌ ప్రారంభించారు. యలమంచిలి, మాడుగులలో నియోజకవర్గ స్థాయి నూతన భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ల్యాబ్‌ సుమారు రూ. 65 లక్షల ఖర్చుతో అత్యాధునిక అగ్రి ల్యాబ్‌లను నిర్మించారు. ఇక్కడ కేవలం మట్టి పరీక్షలే కాకుండా, విత్తనాల నాణ్యత, పురుగుమందుల పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది.

నేడు సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రస్తుతం జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో వినియోగంలో లేవు. సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత కారణంగా ఈ భవనాలు కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారే తప్ప, స్థానిక రైతులకు సేవలు అందడం లేదు. ఖరీఫ్‌ సమయం దగ్గరపడుతుండడంతో రైతులు ఏ ఎరువులు వాడాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే నిధులు విడుదల చేసి అగ్రి ల్యాబ్‌లను పునరుద్ధరించాలని, యుద్ధ ప్రాతిపదికన భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించాలని జిల్లా రైతాంగం డిమాండ్‌ చేస్తోంది.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. సరిగ్గా మరో నెలన్నర రోజుల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంది. అయితే, పంట సాగులో అత్యంత కీలకమైన భూసార పరీక్షల విషయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి ఫలితాలు అందించే వారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అగ్రి ల్యాబ్‌లు నిర్వీర్యమై, పరీక్షలు అటకెక్కాయి. ఖరీఫ్‌ దగ్గర పడుతున్నా వ్యవసాయ శాఖలో పూర్తి సన్నద్ధత కనిపించడం లేదు.

గత ప్రభుత్వంలో జిల్లాలో 3 అగ్రిల్యాబ్‌ల సేవలు

రైతు పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు 12 రకాల పరీక్షలు

2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు

గతేడాదిలో 25,052 నమూనాలు మాత్రమే సేకరణ

Advertisement
 
Advertisement
Advertisement