రూ.16 కోట్లతో పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్ నిర్మాణం
నగర పౌరుల కోసం విశాఖ పోర్టు వినూత్న ప్రయోగం
నెలాఖరు నుంచి అందుబాటులోకి...
దేశంలోనే ఎంతో ప్రత్యేకం
దేశంలో అనేక సముద్రతీర ప్రాంతాల్లో ప్రొమెనేడ్‌లను అభివృద్ధి చేశారు. పుదుచ్చేరిలో రాక్ బీచ్ ప్రాంతంలో కిలోమీటరుకుపైగా ఉన్న బీచ్ రాక్ ప్రొమెనేడ్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు హాయిగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. కేఫ్‌ల్లో కాఫీ తాగుతూ సముద్ర అందాలను తిలకించే వీలుంది. ఇక ముంబైలో 3 కిలోమీటర్ల పొడవైన ‘క్వీన్స్ నెక్లెస్ ఆర్క్’ముంబై డ్రైవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రొమెనేడ్ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవుతో షియోన్ పార్క్ నుంచి షిరోన్ పార్క్ వరకూ అభివృద్ధి చేశారు. ఇక కోల్‌కతా వద్ద నది తీరం వెంబడి విహార ప్రదేశాన్ని అభివృద్ది చేయగా.. కొచ్చి వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఉన్న నడక మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే.. విశాఖ ప్రొమెనేడ్ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సముద్ర అందాలను ఆస్వాదించడంతో పాటు, నౌకాశ్రయంలో జరిగే లైవ్ వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కేవలం విశాఖ పబ్లిక్ ప్రొమెనేడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
సముద్ర తీరంలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, వేడి వేడి కాఫీ తాగుతూ.. భారీ నౌకల్లో కార్గో హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? సముద్రపు అలల సవ్వడి వింటూ... విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ పర్యాటకులకు చిరునవ్వుతో హాయ్ చెప్పాలని భావిస్తున్నారా? భారీ నౌకల్లోకి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ఎలా చేస్తారో ఎలాంటి అనుమతులు లేకుండానే దగ్గరి నుంచి చూడాలని ఉందా?.. విశాఖ నగర వాసులకు ఈ కోరికలన్నీ త్వరలోనే తీరనున్నాయి. నగర పౌరుల కోసం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) సరికొత్త పర్యాటక కానుకను సిద్ధం చేసింది.
విశాఖ వాసులకు పర్యాటక కానుక
ఏకంగా రూ.16 కోట్లతో 600 మీటర్ల పొడవైన అందమైన ‘పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్’ను పోర్టు అధికారులు నిర్మించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆకర్షణీయమైన విహార ప్రదేశాలను అందించే లక్ష్యంతో మంగళవారం విశాఖ పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఈ ప్రొమెనేడ్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పచ్చటి ల్యాండ్‌స్కేపింగ్‌తో దీనిని అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే సముద్రతీరంలో వాకింగ్ చేసుకునే వెసులుబాటు, చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలం, అలాగే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రదేశం నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చైర్మన్ అంగముత్తు తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్‌కు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న దారి గుండా ఈ ప్రొమెనేడ్‌ను చేరుకోవచ్చు.
లైవ్ మారిటైం వీక్షణ
సాధారణంగా ఏ పోర్టులో జరిగే కార్యకలాపాలనైనా సామాన్యులు దగ్గరి నుంచి చూసే అవకాశం ఉండదు. కానీ, విశాఖలో మాత్రం పోర్టులో జరిగే సముద్ర వ్యాపార కార్యక్రమాలను ప్రజలు లైవ్‌గా వీక్షించేలా ఈ ప్రొమెనేడ్‌ను డిజైన్ చేయడం విశేషం. భారీ నౌకల నుంచి సరుకుల రవాణా, అంతర్జాతీయ క్రూయిజ్‌ల రాకపోకలను ప్రజలు సురక్షితంగా చూసి ఆనందించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకమైన డెక్స్‌ను ఏర్పాటు చేశారు.


