మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యమని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రతి మండలంలో ఉత్తీర్ణత, ఫెయిల్ శాతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫలితాల్లో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలనివిద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు, ఎంఈవోలు పాల్గొన్నారు.
రేపు ఎస్సీ కమిషన్ సభ్యుడు జిల్లా పర్యటన
తుమ్మపాల : రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత అధికారి బి.రామానందం ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. అదే రోజు పట్టణంలో గుండాల జంక్షన్ వద్ద శంకరన్ మీటింగ్ హాలులో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారని, అనంతరం దేవరాపల్లి మండలం, మాడుగుల మండలాల్లో పలు సర్వే నంబర్ల గల భూములను స్థల పరిశీలన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్సీ కులస్తులకు సంబంధించి తమ సమస్యలను వినతుల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు.


