ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకూ కార్మికులకు అండగా ఉండి పోరాటం సాగిస్తామని చెప్పారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లేబర్ కోడ్స్ పూర్తిగా రద్దయ్యే వరకు ప్రతి కార్మికుడు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డైలీ వెజ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకపోత ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కాళ్ళ తేలయ్యబాబు, నాయకులు వారాది సత్యనారాయణ, లక్ష్మి, ప్రసన్న, అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


