కళ్లెదుటే సహజ సంపద దోపిడీకి గురవుతున్నా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే...ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అధికారపా | - | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే సహజ సంపద దోపిడీకి గురవుతున్నా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే...ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అధికారపా

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

సాక్షి, అనకాపల్లి : రాష్ట్ర హోం మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా చెరువులను తవ్వేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది. ఎస్‌.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్‌ చెరువు, యలమంచిలి మండలంలో కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు ఇప్పుడు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా.. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారుల పర్యవేక్షణ ఉండదని భావించి.. పొక్లెయిన్‌లతో చెరువు గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వందల ట్రిప్‌ల మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఈ అక్రమ తవ్వకాలు ఎస్‌.రాయవరం మండలంలో ఓ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సదరు నేత ఆధ్వర్యంలోనే సమీప ప్రాంతాల్లో భారీగా మట్టి స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటుక బట్టి యాజమానులకు, కృష్ణాపురం, పులపర్తి గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు ఈ మట్టిని భారీ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దీనిపై స్థానిక రైతులు పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. డయల్‌ 100కు ఫోన్‌ చేసినా పట్టించు కోలేదని వాపోయారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే అధికారులకు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.

నిల్వ ఉండని నీరు.. ఆందోళనలో రైతన్నలు

నియమ నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అస్త వ్యస్తంగా లోతైన గుంతలు తవ్వేస్తుండడంతో రానున్న రోజుల్లో సాగునీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల గర్భం దెబ్బతినడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి, వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా, వారు స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో కూటమినేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం, హైకోర్టు అదేశాలను ధిక్కరించి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం ఏర్పాటు చేయడం వంటి పనులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్పీకి ఫిర్యాదు..

యలమంచిలి మండలం కృష్ణాపురంలో నీటిపారుదల శాఖ చెరువు దుబ్బల చెరువులో అక్రమ మట్టితవ్వకాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కృష్ణాపురం గ్రామంలో గల నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న దుబ్బల చెరువులో నుంచి వమ్మవరం గ్రామానికి చెందిన నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్‌ పల్లెల దివాణం అనుచరుడు, బయ్యవరం మాజీ సర్పంచ్‌ గెంజి శ్రీనివాసరావు పొక్లెయిన్‌, 8 ట్రాక్టర్లు, 10 టిప్పర్లతో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడి కృష్ణాపురం వద్ద ఒక చోట డంప్‌ చేయిస్తున్నారని, అక్కడ నుంచి టిప్పర్లతో నమ్మవరం 5 ఇటుక బట్టీలకు, లక్కవరం ఇటుక బట్టీకి తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్‌సిన్హాను కోరారు.

తూతూ మంత్రంగానే విచారణ..

ఎస్‌.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్‌ చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ఇటుక బట్టీలకు తరలించుకుపోతున్నారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఆయకట్టు ఉన్న చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టడం వల్ల చెరువు గర్భం అస్తవ్యస్తమై సాగునీరు ప్రవహించే అవకాశం లేదన్నారు. గ్రామంలో ఉన్న అయిదారు బట్టీలకు ఇదే క్రమంలో మట్టిని తరలించుకుపోతున్నారని చెప్పారు. ఈ మేరకు అక్రమ తవ్వకాలపై ఇన్‌చార్జి డిప్యూటీ తహసీల్దార్‌ నీరజ విచారణ చేయించారు. ఇటుక పరిశ్రమలకు అక్రమంగా తవ్విన మట్టి వెళుతున్నట్టు గుర్తించారు. దీనిపై రాయవరపు శ్రీనివాసరావు, ఓరుగంటి సత్తిబాబు, దోసపాత్రుని సత్యనారాయణ, తోట నాగబాబు, తోట శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేయమని మైన్స్‌ అధికారులకు ఆమె ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. వారిపై ప్రస్తుతం ఎమ్మార్వో సమీపంలో బైండోవర్‌ చేశారు.

అధికారుల మౌనం.. గ్రామస్తుల ఆగ్రహం

కళ్ల ముందే అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై గ్రామస్థులు, చెరువు ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హోం మంత్రి ఇలాకాలో

మట్టి మాఫియా

పొక్లెయిన్లతో చెరువులు ధ్వంసం, మట్టి దోపిడీ

ట్రాక్టర్లు, లారీల్లో యథేచ్ఛగా రవాణా

ఇటుక బట్టీలకు, రియల్‌ వెంచర్లకు సరఫరా

కూటమి నేత ఆధ్వర్యంలో స్టాక్‌ పాయింట్స్‌

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement