నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్‌కు రూ.2 లక్షలు డిమాండ్
రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో చిట్టిబాబును పట్టుకున్న అధికారులు
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు
నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదై ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేషన్‌కు రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల 7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఏడాదిలో ఇది రెండో కేసు...
నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం ఏడాదిలో ఇది రెండోసారి. ఏడాది కిత్రం వ్యవసాయ బోరుకు ఎన్‌వోసి ఇచ్చేందుకు రైతు నుంచి రూ.12 వేలు డిమాండ్ చేసి కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఆర్‌ఐ కన్నబాబు ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. మండలంలో భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి కొనుగోలు చేసిన భూములను తమ పేరున మార్చుకునేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వీఆర్వోలు, కొంతమంది సిబ్బంది రైతుల నుంచి భారీ స్థాయిలో లంచాలు గుంజుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


