‘పల్లె పండగ’ దండగేనా! | - | Sakshi
Sakshi News home page

‘పల్లె పండగ’ దండగేనా!

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

● రహదారి పనులకు రూ.కోట్ల ఖర్చు ● అయినా అడుగడుగునా గుంతలే ● బాధిత గిరిజనుల మండిపాటు

రోలుగుంట : పల్లె పండగ పథకం పేరిట మండలంలో గల అర్ల పంచాయతీ శివారు గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపట్టినట్టు నేతలు చెబుతున్నా అవి గుంతలకే పరిమితం కావడంతో బాధిత గ్రామాల గిరిజనులు సోమవారం బురదమయంగా మారిన రోడ్డుపై నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వివరాలివి. మండలంలో అర్ల పంచాయతీ శివారు పెదగరువు, పాతలోసింగి తదితర గ్రామాల్లో కోందు ఆదివాసీ గిరిజనులు సమారు 560 మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా బి.టి.రోడ్డు నిర్మాణానికి 2024లో 2 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. పల్లె పండగ–2025 లో భాగంగా గతేడాది జనవరిలో రహదారి పనులకు ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు శంకుస్థాపన చేశారు. ఎర్త్‌ వర్క్‌ క్రషర్‌ పిక్కతో రోడ్డు పనులు చేసి అర్ధంతరంగా వదిలేశారు. తరువాత భారీ వర్షాలకు పిక్కంతా కొట్టుకుపోయి బురదమయంగా మారి గుంతలుగా మారాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల గిరిజనులు సొంత నిధులు సేకరించి రూ.6 లక్షలతో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అది భారీ వర్షాలకు కొట్టుకుపోతోంది. ఇలాఉండగా లోసింగిలో 40 మందికి హౌసింగు స్కీం అందింది. దీంతో ఈ రోడ్డులో మెటీరియల్‌ తీసుకెళ్లే ప్రయత్నంలో రోడ్డు మధ్యలో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో హౌసింగు స్కీం నిలిచిపొయే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్లకు, అధికారులకు తప్ప అరకొర పనులతో తమకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వతీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్లు నిధులు మంజూరు చేసినా అవి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయి కానీ పనులు శూన్యమని ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులు నిమిత్తం రూ.లక్షలకు, లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపించడం మినహా రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయడం లేదని, దీంతో గుంతలు పడిన రోడ్డు బురదమయం కావడంతో గిరిజనులు నిరసనకు దిగారు. సోమవారం ఆ బురద రోడ్డులోనే పాదయాత్ర చేపట్టి డబ్బు ఖర్చు చేసిన రోడ్డు నిర్మాణం ఎక్కడ..? ఇదేనా పల్లె పండగ పథకం తీరు? అంటూ నినాదాలు చేశారు. ఈ రహదారి సమస్య మెరుగుపరచి తమకు డోలిమోత సమస్య తప్పించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు అప్పారావు, కె.వెంకట్రావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement