వెతలే.. వేతనాలు లేవ్‌ | - | Sakshi
Sakshi News home page

వెతలే.. వేతనాలు లేవ్‌

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న వారి గోడును కూటమి సర్కార్‌ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఒక్క పైసా పెంచలేదు సరికదా సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ వారికి భారమవుతోంది.

ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డెస్క్‌

సాక్షి, అనకాపల్లి: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సేవలందించడంలో ఆరోగ్యమిత్రల సేవలు కీలకం. వ్యాధుల బారిన పడిన వారు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు ఆస్పత్రులకు వస్తే వారికి సకాలంలో ఉచిత వైద్య సేవలందేలా కృషి చేసి, వారు కోలుకునే వరకూ వెన్నంటే ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలు చాలీచాలని వేతనంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, వీరి వేతనాల్లో ఒక్క రూపాయి కూడా పెంచకపోగా, కనీసం ఇస్తున్న అరకొర జీతాలను కూడా సకాలంలో విడుదల చేయకుండా వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 163 మంది ఆరోగ్యమిత్రలు, జిల్లా టీమ్‌ లీడర్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆరోగ్య మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా ఆరోగ్య శ్రీ, ఆరోగ్య మిత్రలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ వైద్యసేవలను క్రమేపీ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌..ఆరోగ్య మిత్రలను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలకు తెరలేపుతోంది. రేయింబవళ్లు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవాల్సిన పాలకులు, వారి గోడును పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండెడు చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం,వేతనాలు పెంచే విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోంది.

అందని జీతాలు.. ఆర్థిక ఇబ్బందులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలాఖరు వస్తే చాలు ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నిత్యావసరాల ఖర్చుల కోసం ఎవరిని అడగాలో తెలియక వారు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సేవలందించడంలో ఆరోగ్య మిత్రల పాత్ర కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా, వారికి దక్కేది మాత్రం నామమాత్రపు వేతనమే. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వీరికి అండగా నిలవగా, ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపైనే అదనపు పనిభారం పడుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని ఆరోగ్య మిత్రలు డిమాండ్‌ చేస్తున్నారు.

మూడు జిల్లాల్లో వివరాలు ఇలా..

విశాఖ జిల్లాలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది: 110 మంది

అనకాపల్లి జిల్లాలో మొత్తం సిబ్బంది : 33 మంది

అల్లూరి జిల్లాలో మొత్తం సిబ్బంది : 20 మంది

అనకాపల్లిలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలు

న్యాయస్థానాల్లో పోరాడుతాం

రెండేళ్లుగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. కనీస వేతనం అమలు చేయాలని ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాం. ట్రస్ట్‌ సీఈవోకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మా వేతనాలు విడుదల చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించకపోవతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.

– గోవింద్‌, ఆరోగ్య మిత్రల

అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా అందని జీతాలు

రూ.60 లక్షల వేతన బకాయిలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో

163 మంది ఎదురు చూపులు

రెండేళ్లుగా పైసా పెంచని వైనం..

బండెడు చాకిరీకి అరకొర జీతం

కనీస వేతనం అమలు చేసి,

రెగ్యులరైజ్‌ చేయాలంటూ డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement