● చోడవరం కూటమిలో అసమ్మతి కుంపటి
● ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధిపై
నాయకుల ప్రెస్‌మీట్
● నియోజకవర్గంలో బయటపడుతున్న
నేతల కుమ్ములాట
బుచ్చెయ్యపేట: చోడవరం నియోజకవర్గంలో కూటమి నేతల కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. ఆదివారం మేజర్ పంచాయతీ వడ్డాదిలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు లేకుండానే జిల్లా టీడీపీ అధ్యక్షుడు,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబు, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు, రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామూర్తిలు తమ అనుచరులతో కలిసి అభివృద్ధి పనులపై ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై కాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా చూపించుకునేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పలువురు గుసగుసలాడారు. ఇప్పటికే జిల్లా కేంద్రం అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు మధ్య తీవ్ర వర్గ పోరు సాగుతోంది. అనకాపల్లికి పక్కనే ఉన్న చోడవరం నియోజకవర్గంలోను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబుల మధ్య కూడా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్యన ఉన్న వర్గ పోరు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. 20 రోజుల కిందట కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే రాజు పాల్గొనక పోగా కూటమి నేతలు తాతయ్యబాబు, పి.వి.ఎస్.ఎన్. రాజు,ఈర్లె శ్రీరామూర్తులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా ఈ ముగ్గురు నేతలకు పిలుపు ఉండటం లేదు. కూటమిలో ఉన్న జనసేన,బీజేపీ నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రాజు నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు చేయడంపై జనసేన,బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై కినుక వహించి జనసేన,బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజును వ్యతిరేకిస్తున్న తాతయ్యబాబు పక్కన చేరారు. ఎమ్మెల్యేను ఒంటరి చేయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు,సంక్షేమం గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లేకుండా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే వర్గ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు.


