సీపీఐ జిల్లా కార్యదర్శి దొరబాబు
అనకాపల్లి: సోలార్ స్కీమ్‌ల పేరుతో ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉచిత విద్యుత్’పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సోలార్ స్కీమ్‌ల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఈ పథకాల వల్ల ఆ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతాయని చెప్పారు. ప్రభుత్వ రంగ విద్యుత్ వ్యవస్థను బలహీనపరుస్తూ, భవిష్యత్‌లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత విద్యుత్ పేరుతో ఆశలు చూపుతున్న ప్రభుత్వం ప్రస్తుత సబ్సిడీలను తగ్గించే అవకాశం ఉందన్నారు. సోలార్ ప్యానెల్స్ నిర్వహణ, మరమ్మతులు, పనితీరు వంటి అంశాల్లో వచ్చే సమస్యల గురించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. టెండర్ల కేటాయింపు, అమలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అవినీతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజల డబ్బుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణంలో సుమారు 10 రోజుల క్రితం శ్రీరామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పాడైపోయిందన్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ అధికారులకు గృహయజమాని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.


