‘మనమిత్ర’ ద్వారా అప్పన్న టికెట్లు సులభతరం | - | Sakshi
Sakshi News home page

‘మనమిత్ర’ ద్వారా అప్పన్న టికెట్లు సులభతరం

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్‌ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, భక్తులు వీటిని విరివిగా వినియోగించుకోవాలని ఈవో జె.వెంకటరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుంచే మొబైల్‌ ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టోకెన్లు, వసతి గదులను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల సాధారణ క్యూతో సంబంధం లేకుండా అత్యంత తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం పూర్తవుతుందని ఆయన వివరించారు. దళారుల బెడద లేకుండా, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ ‘మనమిత్ర’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు తమ మొబైల్‌లో 9552300009 నంబర్‌ను సేవ్‌ చేసుకుని, వాట్సాప్‌లో మెసేజ్‌ పంపడం ద్వారా సులభమైన పద్ధతిలో ఈ సేవలను పొందవచ్చునని ఈవో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement