సాక్షి, అనకాపల్లి: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తెలుగుతమ్ముళ్లలో ఆధిపత్య పోరు మరోసారి పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణపై ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ‘తమ్ముళ్ల’ మధ్య రచ్చ బట్టబయలైంది. గత ఏడాది డిసెంబర్‌లో అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద దాడి వీరభద్రరావు, పీలా గోవింద్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరూ కలిసి పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అదే నియోజకర్గంలో తుమ్మపాలలో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే పీలా గోవింద్‌పై విమర్శలు సంధించారు. ఇది మరవక ముందే.. గోవింద్‌పైనే అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి దాడి వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ వర్గీయులు, సీనియర్ టీడీపీ నేతలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. వాస్తవానికి వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కాదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది రెండు వర్గాల మధ్య ఘర్షణకే దారితీస్తోంది. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను పీలా గోవింద్ ఏకపక్షంగా తన అనుచరులతోనే నిర్వహిస్తున్నారని, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న సీనియర్లను విస్మరిస్తున్నారని మాజీ మంత్రి దాడి వర్గం, పార్టీలో సీనియర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతీ కార్యక్రమంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి, పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, విడివిడిగా సమావేశాలు నిర్వహించడంతో అసలు పార్టీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పదవుల కోసం, పట్టు కోసం అగ్ర నాయకులు చేస్తున్న ఈ ఆధిపత్య పోరు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తమ కొంప ముంచుతుందేమోనని కార్యకర్తలు భయపడుతున్నారు.
తారస్థాయికి విభేదాలు..
గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు అనకాపల్లి నియోకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా అధిష్టానం కొనసాగించింది. మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా ఎన్నికలకు ముందు నియోజకవర్గం టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. అయితే అక్కడ పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం కల్పించారు. కాగా గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ..మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవింద్‌కు కాస్త స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో పనులు చేసే విషయంలో అధికారులు కూడా పీలా గోవింద్‌కే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని టీడీపీలో చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని దాడి వర్గం... ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయంటూ ఆరోపిస్తోంది. అక్కడ నుంచి ప్రారంభమైన వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి.
అధినేత వార్నింగ్ బేఖాతర్..
గత ఏడాది డిసెంబర్ 20న అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పరస్పరం ఫిర్యా దు చేసుకున్నారు. దీంతో ఇద్దరు నేతలతో వేర్వేరుగా చంద్రబాబు మాట్లాడారు. ‘మీ బాగోతాలు అన్ని నా దగ్గర ఉన్నాయి.. అంతా చూస్తూనే ఉన్నా.. నేను జోక్యం చేసుకునే అంతవరకు సాగదీయకండి.. తమాషాలుగా ఉందా’ అని అంటూ హెచ్చరించినట్టు ఆ పార్టీలో సీనియర్ నాయకులు బహిరంగంగానే చర్చించుకున్నారు. ఇద్దరు మాజీ లకు అధినేత వార్నింగ్ ఇవ్వడం..వాటిని వారు బేఖాతరు చేయడం ఆ పార్టీలో చర్చీనీయాంశంగా మారింది.
అనకాపల్లి తెలుగు తమ్ముళ్ల
మధ్య విభేదాలు
మాజీ మంత్రి దాడి వర్సెస్
నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వైఖరిపై జిల్లా అధ్యక్షుడుకి దాడి వర్గీయుల ఫిర్యాదు
గతంలో తాళ్లపాలెంలో
చంద్రబాబు వద్ద వీరి పంచాయితీ
అధినేత చంద్రబాబు వార్నింగ్ బేఖాతర్


