కె.కోటపాడు: ఆర్లి, చింతపాలెం, గురుగుబిల్లి రెవెన్యూలో గల భూములను ఎస్‌ఈజెడ్‌కు ఇచ్చేది లేదంటూ ఆర్లిలో రైతులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న మాట్లాడుతూ ఎస్‌ఈజెడ్‌కు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఈ గ్రామాల్లో గల రైతులు ఒక్క పక్క నిరసన తెలుపుతుంటే మరోవైపు ఈ గ్రామాల నుంచి కొంత మంది రైతులను శుక్రవారం ఆర్‌డీవో వద్దకు ఎమ్మెల్యే తీసుకువెళ్లి భూములకు ఎంత ధర ఇస్తారో చెప్పాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని వెంకన్న అన్నారు. గత ఏడాది ఎస్‌ఈజెడ్‌కు భూములు తీసుకుంటామని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చెప్పినప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూ దరఖాస్తులను అధికారులకు అందిస్తున్నారని అన్నారు. భూములు ఇవ్వని రైతులపై కేసులు పెడతామంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బెదిరిస్తున్నా... ఇటువంటి బెదిరింపులకు ఆర్లి పంచాయతీలోని రైతులు బయపడరని వెంకన్న స్పష్టం చేశారు. గతంలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటు చేసిన పరవాడ ప్రాంతంలో నిషేధిత కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసే పరిస్థితి ఉందని, ఈ ప్రాంతంలో వ్యర్థాలు ఎక్కడకు పంపుతారని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పన పేరుతో నిషేధిత కంపెనీల ఏర్పాటుతో పచ్చటి పొలాలను నాశనం చేసే యత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కేటాయింపులు జరిగినప్పుడే ఏ కంపెనీలు ఈ ప్రాంతంలో పెడతారో ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు. బలవంతపు భూసేకరణతో ప్రజల జీవితాలను నాశనం చేయనున్నారని వెంకన్న అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పంటలకు పనికి వచ్చే భూములని అన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేందుకు ముందుకు రారని, బలవంతపు భూసేకరణ జరిగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని వెంకన్న తెలిపారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, ఈర్లె నాయుడుబాబు, రైతులు ఆర్.ఏ.పాత్రుడు, కక్కల శివ, తాళ్ల నాగేష్, సీముసురు రాము, ఇమంది రాజుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఆర్లిలో రైతులతో కలిసి
సీపీఎం నాయకుల నిరసన


