బీచ్‌రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


