దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలోని అసైన్డ్ భూములపై స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సహా అధికార పార్టీ నేతల కన్ను పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నియోజకవర్గంలోని అసైన్డ్ పట్టాదారులంతా అప్రమత్తంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పరిశ్రమల పేరిట పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల కుట్రలను రైతులు, గిరిజనులు, వృత్తిదారులు, దళితులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కొండకొడాబు, సమ్మెద, కొత్తూరు, చింతలపూడి, కోరాడ గ్రామాలలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట 820 ఎకరాలను, చీడికాడ మండలం జి. కొత్తపల్లి, అడవిల అగ్రహారం, చినగోగాడ, బైలపూడి గ్రామాల్లో సోలార్ ప్లాంట్ పేరిట 262 ఎకరాలను, కె.కోటపాడు మండలం ఆర్లి, గుల్లేపల్లి, చింతపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఎస్‌ఈజెడ్ పేరిట 10,250 ఎకరాలను, మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో వీఎంఆర్డీఏ పేరిట 110 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్లి పంచాయతీలో నాలుగు రోజులు క్రితం కూటమి నాయకులు మీటింగ్ పెడితే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేశారన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందర్నీ తాజాగా ఆర్డీవో దగ్గరికి పంపించి భూములు ఇస్తున్నట్లుగా చెప్పించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. వ్యవసాయంపై అధారపడిన మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందుగా సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, ఆ తర్వాత వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు కోసం కృషి చేయాలని పాలకులకు హితవు పలికారు. పరిశ్రమల పేరుతో పేద రైతుల అసైన్డ్ భూములను కాజేయాలని చూస్తే ఊరుకునేది లేదని, రైతులకు అండగా నిలిచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.


