ఉత్పత్తి కేంద్రం ఫినిష్‌! | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి కేంద్రం ఫినిష్‌!

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

ఉత్తరాంధ్రలోనే తాండవలో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రానికి ఒకప్పుడు ప్రత్యేకత ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లుగా ఇక్కడ చేప పిల్లలు ఉత్పత్తి జరగలేదు. గతంలో ఏటా కోటి 25 లక్షల చేప పిల్లల ఉత్పత్తి జరిగే చోట నేడు ఇతర జిల్లాల్లో చేప పిల్లలు కొనుగోలు చేసి తరలించే దుస్థితికి తీసుకువచ్చింది.

నాతవరం :

తాండవ రిజర్వాయరు దిగువ ప్రాంతంలో 1984లో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జూన్‌ – ఆగస్టు మధ్య కాలంలో ఇక్కడ కృత్రిమ ఉత్పత్తి ద్వారా కోటి 25 లక్షలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. పెద్ద చేపలకు హార్మోన్లు అభివృద్ధికి ఇంజక్షన్లు చేసి కృత్రిమ ఉత్పత్తి ద్వారా వివిధ రకాలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఆ పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసేవారు. ఇంకా మిగిలిన పిల్లలను జిల్లాలో ఉన్న తాండవ, రైవాడ, కల్యాణపులోవ, కోనాం, వరాహ, మేహాద్రిగెడ్డ, రావణాపల్లి రిజర్వాయర్లలో విడుదలకు తరలించేవారు. చెరువుల్లో పెంచుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయాలు చేసేవారు. అయితే రెండేళ్లుగా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రంలో మచ్చుకై నా పిల్లలు ఉత్పత్తి చేయలేదు. కేంద్రంలో సిబ్బంది జాడే కన్పించడం లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడు చూసినా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం మూసి ఉంటుంది. చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు నిర్మించిన నీటి కుండీలు నీటితో నిండుగా కన్పిస్తున్నాయి. నీటి కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన బోరుని ఉపయోగించక మరమ్మతుకు గురై పిచ్చి మొక్కల నడుమ కన్పించకుండా ఉంది. కేంద్రం గేట్లు ఊడి పోయి భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. కిటికీలు, తలుపులు చెదలుపట్టి విషకీటకాలకు నిలయంగా మారింది. గతంలో ఇక్కడ పని చేసే సిబ్బంది పదవీ విరమణ చేయగా, మరికొందరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్రం నర్సీపట్నం మత్స్యశాఖ అభివృద్ధి అఽధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది.

సామగ్రి లేదు, సిబ్బంది లేరు...

ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అభివృద్ధి అఽధికారి నాగమణిని వివరణ కోరగా చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు సామగ్రి లేదన్నారు. గతంలో పని చేసే సిబ్బంది ప్రస్తుతం లేరని, సచివాలయ సిబ్బందితో మూడేళ్లుగా పని చేయిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెండుసార్లు ఇతర జిల్లాలో 9 లక్షల 80 వేల చేప పిల్లలు కొనుగోలు చేసి తీసుకొచ్చి తాండవ ప్రాజెక్టులో విడుదల చేశామన్నారు.

తాండవలో చేప పిల్లలు పెంచే నీటి కుండీలు

రెండేళ్లుగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మూత

గతంలో ఏటా కోటి 25 లక్షలకు పైగా పిల్లలు ఉత్పత్తి

ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సంఘాలకు సరఫరా

కూటమి ప్రభుత్వం వచ్చాక మూలకు చేరిన వైనం

నిర్వహణ లేక కేంద్రం భవనాలు, నీటి కుండీలు శిథిలం

Advertisement
 
Advertisement
Advertisement