ప్రభుత్వ వైద్యం.. మామూళ్ల మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యం.. మామూళ్ల మాయాజాలం!

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

● నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఆగని‘చేతివాటం’ ● సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి కన్నీటి గాథ

అది పేదోడి పాలిట పెన్నిధి కావాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుందన్న ఆశతో వచ్చే నిరుపేదల రక్తాన్ని సిబ్బంది లంచాల రూపంలో జుర్రుకుంటున్నారు. రూపాయి లేనిదే స్ట్రచర్‌ కదలదు.. వంద నోటు విదిలిస్తేనే వార్డు క్లీన్‌ అవుతుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది చేస్తున్న ఈ వసూళ్ల దందాపై ఓ మహిళా రోగి ధైర్యంగా స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

నర్సీపట్నం : నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో లంచాలు ఆరికట్టండి...అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళా పేషెంట్‌ ఆవేదనతో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తుంది. రావికమతం మండలం, టి.అర్జాపురం గ్రామానికి చెందిన తురబల్లి కోట సత్యవతి జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన ఏరియా హాస్పిటల్‌లో చేరింది. సిబ్బంది చేతివాటంపై ఆమె వీడియో చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. హాయ్‌ ఫ్రెండ్స్‌, నా ఆరోగ్య పరిస్థితి బాగోక ఏరియా హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాను.. క్లినింగ్‌ చేసే సిబ్బంది డబ్బుల కోసం పేషెంట్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్న క్యాంటిన్‌కు వెళ్లి రూ.5 పెట్టి భోజనం తినేందుకు ఇబ్బంది పడుతున్న రోజుల్లో మనిషికి వంద రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం...అంటూ మహిళా పేషెంట్‌ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న వార్డులో సుమారు 30 బెడ్‌లు ఉన్నాయి. వీళ్లు మంచానికి వంద చొప్పున వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకనే ఏరియా హాస్పిటల్‌కు వచ్చాం. యూరిన్‌ పెడితే రూ.100, సర్జరీ పేషెంట్‌ వద్ద రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని వీడియోలో పేర్కొంది. కదల్లేని రోగులను స్ట్రచర్‌పై ఈసీ జీ, ఎక్స్‌రేకు తీసు కు వెళ్లాలంటే వంద రూపాయలకు తక్కువైతే తీసుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. వంద రూపాయలు ఉంటే పండ్లు లేక భోజనం కొనుక్కుందాం అనుకుంటే సిబ్బంది వసూళ్లతో ఇబ్బంది పడుతున్నాం. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే సిబ్బంది తిరగబడుతున్నారని ఏకరువు పెట్టింది. ఈ పేషెంట్‌ వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయమై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుధాశారదను వివరణ కోరగా పేషెంట్‌ను డబ్బుల కోసం డిమాండ్‌ చేసిన శానిటేషన్‌ వర్కర్‌ను విధుల నుంచి తొలగించామని, డబ్బులు డిమాండ్‌ చేయవద్దని శానిటేషన్‌ సిబ్బందిని హెచ్చరించామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement