రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ
సహాయం చేసిన ’రహ–వీర్’లకు రూ.25 వేలు బహుమతి
అనకాపల్లి: రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పీఎం–రాహత్’ పథకం ఒక గొప్ప వరమని ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. రహదారి ప్రమాదంలో గోల్డెన్ అవర్‌గా ప్రాణాలకు సంజీవని ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైన సమయం అన్నారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 90శాతం ఎక్కువగా ఉంటుందని, ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 నంబర్‌కు సమాచారం అందించి, 108 అంబులెన్స్ ద్వారా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలన్నారు. పీఎం–రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా సరే (పాదచారులు, వాహనదారులు, లేదా విదేశీయులు) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం, పేద–ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కల్పిస్తుందన్నారు. సహాయం చేసే వారికి ’రక్షన కింద ప్రభుత్వం రూ.25,000 బహుమతి అందజేస్తుందన్నారు. రహదారి ప్రమాదాల్లో మానవత్వంతో స్పందించి, ప్రాణాలను నిలబెట్టి సీఎం రాహత్‌ను పొందాలని ఆయన పిలుపునిచ్చారు.


