చెలగాటం | - | Sakshi
Sakshi News home page

చెలగాటం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

చెరకు రైతులతో
గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌పై ఎటూ తేల్చని ప్రభుత్వం నాట్లకు అదును దాటుతున్నా అంతులేని నిర్లక్ష్యం సాగుపై అనిశ్చితిలో అన్నదాతలు వచ్చే సీజన్‌లో కూడా క్రషింగ్‌ను నిలిపివేసేందుకు కుట్ర ? బకాయిలు చెల్లింపుపై నోరుమెదపని ఎమ్మెల్యేలు మరో సారి ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు,కార్మికులు

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ రైతుల, కార్మికుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. దీంతో రైతులు, కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరో వైపు ఫ్యాక్టరీని మూసివేసినట్టు చెప్పకుండా.. వచ్చే క్రషింగ్‌ సీజన్‌కు అవసరమైన చెరకు సాగుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా ప్రభుత్వం రైతులతో దోబూచులాడుతోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో కూడా ఫ్యాక్టరీకి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. చెరకు రైతుల పేమెంట్లు, కార్మికుల జీత బకాయిలకు సుమారు రూ. 29కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఫ్యాక్టరీని మూసివేసేదిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

అదును దాటుతున్నా అంతులేని నిర్లక్ష్యం

ఒక పక్క చెరకు సాగుకు విత్తనం నాటే అదును దాటుతోంది. ఈ నెలాఖరులోగా చెరకు విత్తనం నాటకపోతే ఈ ఏడాది క్రషింగ్‌కు చెరకు ఎక్కడా ఉండదు. అలాంటి పరిస్థితిలో ఇప్పటి వరకూ ప్రభుత్వం గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని నడిపించే విధంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చెరకు పంట వేయాలా వద్దా అనేది ప్రశ్నా ర్థకంగా మారింది. ఇటీవల చోడవరం ఎమ్మె ల్యే కె.ఎస్‌.ఎస్‌.ఎస్‌.రాజు చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేయాలంటూ ప్రకటనలు చేశా రు. అయితే ఆ మొక్కజొన్న ఎవరు కొంటారు, ఎక్కడ మార్కెటింగ్‌ చేయాలో ఆయన చెప్పలేదు. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో ఏటా 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. ఇన్ని వేల ఎకరాల్లో ఇప్పుడు ఏ పంట వేయాలో రైతులకు అర్థంకాన్ని పరిస్థితి. 2026–27 క్రషింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తేనే కాని చెరకు పంట సాగుపై రైతుల్లో నెలకొన్న ఆందోళన తొలిగేపరిస్థితి లేదు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంతో చెరకు రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యేల మాటలు.. నీటి మూటలు

చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బండారు సత్యనారాయణమూర్తి ఇచ్చిన హామీలు కూడా నీటి మూటలుగా మిగిలాయి. ఫ్యాక్టరీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం...నిధులు తెస్తున్నాం...ఇచ్చేస్తాం అంటూ అంటూ ఊదరగొట్టిన అధికార పార్టీకి చెందిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్‌కు సంబంధించి చెరకు రైతులకు రూ.24కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కార్మికులకు జీతభత్యాలు కింద మరో రూ. 7కోట్లు బకాయిలు చెల్లించాలి. ఫ్యాక్టరీ పూర్తిగా నష్టాల్లో ఉండటంతో ప్రభుత్వమే గ్రాంటు రూపంలో ఆదుకోవాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ఫ్యాక్టరీకి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ. 10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ సాయం చేసి ఐదేళ్లలో సుమారు రూ. 89కోట్లు సాయం అందించింది. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా రైతులకు పేమెంట్స్‌, కా ర్మికులకు జీతాలు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్‌ సజావుగా సాగింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత గత సీజన్‌లో ఫ్యాక్టరీలో క్రషింగే చేయకుండా ఇక్కడి చెరకును సంకిల ప్రైవేటు ఫ్యాక్టరీకి తరలించారు.

మరోసారి ఉద్యమానికి

సిద్ధమతున్న రైతులు, కార్మికులు

ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెల్యేలు తమను మోసం చేశారంటూ మరోసారి ఆందోళనకు రైతులు, కార్మికులు సిద్ధమతున్నారు. ఇప్పటికే అఖిలపక్షనాయకులంతా దీనిపై చర్చలు చేస్తూ ఈ దఫా ఆందోళన ఏవిధంగా చేయాలనే అంశంపై యోచన చేస్తున్నారు.

ఫ్యాక్టరీని నమ్ముకుని చెరకు పండించిన 24వేల మంది రైతులు, కార్మికులు ఏమైపోతారు, వారి మనుగడ ఏంటి అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకు రైతులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాట మాడుతోంది. రైతులు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిల విషయంలో నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్న సర్కారు...మరో వైపు వచ్చే క్రషింగ్‌ సీజన్‌కు అవసరమైన చెరకు సాగుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా దోబూచులాడుతుండడంతో రైతులు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చెరకు పంట వేయాలో... లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే సీజన్‌లో కూడా గోవాడలో క్రషింగ్‌ జరపకుండా ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించలేకపోయిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రైతులతో ఉద్యమానికి సిద్ధం కావాలి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు, కనీసం బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేయించలేకపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఎమ్మెల్యేలిద్దరూ వెంటనే రాజీనామా చేయాలి. త్వరలో రైతులు,కార్మికులంతా కలిసి ఉద్యమానికి దిగుతాం.

–రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు,చోడవరం.

ప్రభుత్వం డ్రామాలాడుతోంది

ఈనెలాఖరులతో చెరకు విత్తనం నాటేందుకు అదును ముగుస్తుంది. ఈ ఏడాదైనా ఫ్యాక్టరీ క్రషింగ్‌ చేస్తారా లేదా అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. చెరకు పంట వేయకపోతే చెరకు లేదు..అందుకే ఈ ఏడాది కూడా క్రషింగ్‌ చేయలేమని చెప్పి పూర్తిగా ఫ్యాక్టరీని మూసివేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రైతులు,కార్మికుల బకాయిలు చెల్లించకపోతే వారు ఎలా బతుకుతారు. బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే సీజన్‌లో నైనా ఫ్యాక్టరీని తెరిచేలా చర్యలు తీసుకునేవరకూ ఉద్యమం ఆగదు.

–కోన మోహన్‌రావు, ఏపీ రైతు కూలీ సంఘం, జిల్లా అధ్యక్షుడు.

మరోసారి ఉద్యమం

పదిరోజుల్లో కార్మికుల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు తర్వాత పట్టించుకోవడం మానేశారు. చెరకు బకాయిలు రెండేళ్లుగా చెల్లించలేదు. క్రషింగ్‌ చేస్తారో.. ఫ్యాక్టరీని మూసివేస్తారో చెప్పలేదు. గందరగోళంలో ఉంచారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మరో సారి ఉద్యమానికి దిగుతాం.

–శరగడం రామునాయుడు, గుర్తింపు కార్మిక సంఘం, ప్రధానకార్యదర్శి, గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ.

Advertisement
 
Advertisement
Advertisement