రామారాయుడుపాలెంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న డీఈవో అప్పారావునాయుడు
యలమంచిలి రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావు నాయుడు కోరారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి రామారాయుడుపాలెంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వేగి రాజుబాబు తన కుమార్తెను డీఈవో సమక్షంలో తాను పనిచేస్తున్న రామారాయుడుపాలెం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కూడా తన బిడ్డకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేటు,కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా అన్ని సౌకర్యాలతో కళకళలాడుతున్నాయని,ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు.ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు దాటితే మోడల్ ప్రైమరీ స్కూల్‌గా తీర్చిదిద్దితామని డీఈవో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సుసర్ల సూర్యప్రకాష్,అరుణ్‌కుమార్,సాయిబాబా,వెంకటేశ్వర్రావు, రాజుబాబు, ప్రసాదరావు పాల్గొన్నారు.


