ఆరు నెలలుగా అందని కూలి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న శ్రామికులు జిల్లాలో రూ.4.56 కోట్లు బకాయి గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ పెండింగ్ 3 వారాల బకాయిలు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడి ఇంకా ఖాతాల్లో జమ కాలేదంటున్న వేతనదారులు
ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మండుటెండలో రోజంతా చెమటోడ్చి కష్టపడి పనిచేసినా సక్రమంగా వేతనాలు అందడం లేదు. నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.4.56 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో వేరే దారిలేక ఉపాధి పనులకు వెళ్లాల్సివస్తోంది. కాగా, మూడు వారాల డబ్బులు మంజూరయ్యాయని డ్వామా అధికారులు చెబుతున్నారు. అయితే తమ బ్యాంక్ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని వేతనదారులంటున్నారు.
ఉపాధి కూలీల
సాక్షి, అనకాపల్లి : ఉపాధి హామీ పథకం పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలంతా ఉపాధి పనుల బాట పట్టారు. పనులకు వెళ్తున్న కూలీలకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నా రు. డబ్బులు ఎప్పుడు ఇస్తారా..? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వేతనాలు రాలేదు. జిల్లాలో 24 మండల పరిధిలో ఉపాధి వేతనదారులకు సుమారు రూ.4.56 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. కాగా ఆరు నెలలకు గానూ 3 వారాల వేతనాలను విడుదల చేసినట్లు డ్వామా అధికారులు వెల్లడిచారు. కానీ వేతదారులు తమ బ్యాంక్ ఖాతాల్లో ఇంకా జమ కాలేదంటూ చెబుతున్నారు.
జిల్లాను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఆరు మండలాలున్నాయి. నాలుగు క్లస్టర్లలోని 24 మండలాల పరిధిలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎస్.రాయవరం, అనకాపల్లి, కోటవురట్ల, నర్సీప ట్నం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట, చీడికాడ, గొలుగొండ, సబ్బవరం, యలమంచిలి, రాంబిల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు, దేవరాపల్లి, నాతవరం, మునగపాక, మాడుగుల, కశింకోట, చోడవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, పరవాడ, మాకవరపాలెం మండలాల్లో సుమారు లక్ష మంది వరకు కూలీలకు వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది.
రోజుకు లక్ష మంది కూలీల హాజరు..
జిల్లాలో 2,81,075 జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో యాక్టివ్ జాబ్ కార్డులు 2,02,924 వరకు ఉన్నాయి. రోజుకు సగటున లక్ష మంది పనులకు హాజరవుతున్నట్లు డ్వామా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యేవారికి రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలి లభిస్తోంది. ఆరు నెలలుగా వీరికి వేతనాలు విడుదల కాకపోవడంతో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
మండాలలు : 24 జాబ్ కార్డులు : 2,81,075 యాక్టివ్ జాబ్‌కార్డులు : 2,02,924 రోజూ పనికి హాజరవుతున్న కూలీలు : 1 లక్ష మంది


