సాక్షి, అనకాపల్లి: స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ వేధింపులు బుధవారం పరాకాష్టకు చేరుకున్నాయి. వైఎస్‌ఆర్సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏక శివ, ఉపాధ్యక్షుడు సుర్ల నాయుడును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. స్పీకర్ హోదాలో ఉండి కూడా అయ్యన్నపాత్రుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు.
మఫ్టీలో వచ్చి..
గణేష్‌ను అరెస్టు చేస్తారన్న వార్తలతో మంగళవారం రాత్రి నుంచే నాలుగు మండలాల కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, వ్యూహాత్మకంగా కార్డెన్ సెర్చ్ పేరుతో కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు.. బుధవారం మధ్యాహ్నం మఫ్టీలో వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయం చూసి ఆయన పీఏ ఏకా శివ, సన్నిహితుడు సుర్ల నాయుడులను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ అక్రమ నిర్బంధాలపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ధైర్యంగా నిలిచిన కళావతి
అక్రమ అరెస్టులతో భయాందోళనలు సృష్టించాలని చూసినా, మాజీ ఎమ్మెల్యే సతీమణి కళావతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అరెస్టు చేసిన ఇద్దరు నేతలకు భరోసా కల్పించేందుకు ఆమె కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. పార్టీ నేతలకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో కోర్టు నుంచి బయటకు వచ్చిన వారిని ఆమె ధైర్యం చెప్పారు.


