మాడుగుల రూరల్/దేవరాపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి బలమైన గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఖండివరం– కోనాం రహదారిలో వైఎస్సార్‌సీసీ నాయకుడు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావుకు చెందిన అరటి తోటలో 50 అరటి చెట్లు గెలలతో నేలకొరిగాయి. సుమారు ఎకరున్నర పొలంలో వేసిన అరటితోటలో చెట్లు నేలకొరగడంతో భారీ నష్టం వాటిల్లిందని శ్రీనివాసరావు తెలిపారు. మాడుగుల మండలంలో శంకరం, తాటిపర్తి, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులకు పలు చెట్లు నేలకొరిగాయి. దేవరాపల్లి మండలంలో సుమారు గంట సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన చోదకులు, ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలు లు, భారీ వర్షం కారణంగా సాయంత్రం ఏడు గంట ల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చోడవరం: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చోడవరం, బుచ్చెయ్యపేట,రావికమతం, రోలుగుంట మండలాల్లో మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది. తోటల్లో 20శాతం పంట నేలరాలిపోయింది.నేలరాలిన మామిడి కాయలన్నీ పగిలి, అమ్మకానికి కూడా వీలులేకుండా పోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.


