కలెక్షన్‌! | - | Sakshi
Sakshi News home page

కలెక్షన్‌!

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

కనెక్షన్‌ పేరిట

రైతులతో ట్రాన్స్‌కో అధికారుల చెలగాటం

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా కోసం ముప్పతిప్పలు

డీడీలు చెల్లించినా కనెక్షన్‌ కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందే

స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం చేయి తడపాల్సిందే !

సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు

అన్నదాతల ఆవేదన

రైతుల పొలాల్లో స్తంభాలు వేసి,

లైన్లు ఏర్పాటు చేయకుండా

వదిలేసిన దృశ్యం

నక్కపల్లి : అసలే వేసవి కాలం, వర్షాలు పడడం లేదు. వేసిన పంటలను కాపాడుకోవాలంటే నీరు అవసరం. సొంత ఖర్చులతో బోర్లు ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్‌ సరఫరా ఉండాలి. పొలాల్లో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ప్రభుత్వానికి (ట్రాన్స్‌కో) వారికి లక్షలాది రూపాయలు చెల్లించాలి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కనెక్షన్‌ల కోసం డబ్బులు చెల్లించినప్పటికీ విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయకుండా ట్రాన్స్‌కో అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్నా విద్యుత్‌ సరఫరా కోసం నెలల తరబడి ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్దితి ఏర్పడుతోందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి కోసం నానా పాట్లు

పాయకరావుపేట నియోజకవర్గం పూర్తిగా వర్షాధార ప్రాంతం, ఇక్కడ పెద్దగా నీటి వనరులు లేవు. తాండవ, వరాహ నదులున్నప్పటికీ వర్షాలు పడిన సమయంలోనే సాగునీరు అందుతుంది. మిగిలిన సీజన్‌లో రైతుల వ్యవసాయ బోర్లపైనే ఆధాడి పంటలు సాగు చేసుకోవడం జరుగుతంది. మెరక ప్రాంతాల్లో రైతులు జీడి, మామిడి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన వన పంటలతోపాటు కూరగాయల పెంపకాన్ని చేపడుతూ వాటిద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటారు. ఈ పంటలకు నీటి సదుపాయం నిమిత్తం సొంతంగా వ్యవసాయ బోర్లు నిర్మిస్తారు. విద్యుత్‌ సరఫరా ట్రాన్స్‌కో వారు ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా స్తంభాలు, లైన్లు, ట్రాన్సఫార్మర్లు అవసరమైతే రైతుల నుంచే చార్జీలు వసూలు చేస్తారు. ఇలా మండలంలో గొడిచర్లలో నలుగురు రైతులు తమకున్న సుమారు 8 ఎకరాల్లో మామిడి జీడి పంటల కోసం బోరు నిర్మించేందుకు సిద్ధపడ్డారు. దీనికోసం విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ట్రాన్స్‌కో వారికి ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేశారు. కొత్త స్తంభాలు వేసి లైన్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి రూ.2.51 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ నోటీసు ఇచ్చారు. దీంతో రైతులు గత ఏడాది మే 13వ తేదీన రూ.2.51 లక్షలు డీడీ తీసి ట్రాన్స్‌కో అధికారులకు సమర్పించారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు స్తంభాలు మాత్రమే ఏర్పాటు చేసి వదిలేశారు. వేసిన స్తంభాలకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తే బోరు నిర్మించుకుంటామంటూ 8 నెలల నుంచి రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డీడీలు చెల్లించి ఏడాది పూర్తవుతోందని విద్యుత్‌ సరఫరా ఎప్పుడిస్తారంటూ నిలదీసిన రైతులపై ట్రాన్స్‌కో అధికారులు కక్ష సాధింపులకు తెగబడ్డారు. లైన్లకు, స్తంభాలకు, వాటికి సపోర్టు స్తంభాలకు రూ.2.51 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని గతంలో నోటీసు ఇచ్చిన ట్రాన్స్‌కో అధికారులు రైతులను ఆర్దికంగా ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో వేసిన స్తంభాలకు సపోర్టుగా స్తంభాలు వేయాలని దాని కోసం అదనంగా మరో రూ.1.35 లక్షలు చెల్లిస్తే తప్ప మీ భూములకు విద్యుత్‌ సరఫరా ఇవ్వబోమని డిమాండ్‌ నోటీసు ఇచ్చారు. నీరు లేక పంటలు ఎండిపోతుండడంతో గత్యంతరం లేక రైతులు ట్రాన్స్‌కో వారికి రూ.1.35 లక్షలకు డీడీ తీసి ఇచ్చారు. ఇది జరిగి 2 నెలలు గడుస్తున్నా ట్రాన్స్‌ కో అధికారుల్లో మాత్రం చలనం లేదు. ప్రభుత్వానికి డీడీలు తీస్తే సరిపోతుందా, మీ పంటలను నీటితో తడపాలంటే మా చేతులు తడపాల్సిందేనంటూ పరోక్షంగా తెలియజేసే విధంగా వేసిన స్తంభాలకు తీగలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు.

నీరు లేక ఎండుతున్న తోటలు

సుమారు రూ.4 లక్షలు చెల్లించిన రైతులు మాత్రం ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ ప్రతిరోజు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం మామిడి, జీడి పంటల సీజన్‌ మొదలైంది. తోటలకు నీటి అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దుక్కులు, పురుగు మందులు పిచికారీ చేశామని, కౌలుకు తీసుకున్న రైతులకు అడ్వాన్సులు చెల్లించామని వర్షాలు పడక మామిడి కాయలకు తెగుళ్లు వచ్చి రాలిపోవడం, కుళ్లిపోవడం వంటి నష్టాలను చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన మాత్రం ట్రాన్స్‌కో వారికి పట్టడం లేదు.

డబ్బు కట్టినా కనెక్షన్‌ ఇవ్వలేదు

నాతో పాటు నలుగురు రైతులు కలసి వ్యవసాయ బోరుకు విద్యుత్‌ సరఫరా కోసం దరఖాస్తు చేశాం. స్తంభాలు వేసి కొత్తలైను ఏర్పాటు కోసం రూ.2.51 లక్షలు డీడీ కట్టాలంటే ఏడాది క్రితం చెల్లించాం. తర్వాత స్తంభాలు వేసి లైను ఇవ్వకుండా వదిలేశారు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోలేదు. గట్టిగా నిలదీస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. మరో రూ.1.35 లక్షలు చెల్లిస్తే తప్ప లైను ఏర్పాటు చేయడం కుదరదని నోటీసు ఇచ్చారు. ఈ మొత్తాన్ని గత నెల 30వ తేదీన డీడీ తీసి ఇచ్చాం. ఇప్పటి వరకు లైన్లు ఏర్పాటు చేయలేదు. నీరు లేక జీడి, మామిడి, కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయి. రూ.నాలుగు లక్షలు ప్రభుత్వానికి చెల్లించినప్పటికీ కనెక్షన్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తోటల మీద లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టేశాం. ఏం చేయాలో తోచడం లేదు.

–ఇందన రాము, రైతు గొడిచర్ల

రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోంది.ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు విద్యుత్‌ సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌కో ద్వారా ముప్పు తిప్పలు పెడుతోంది. రూ.లక్షలు చెల్లించినా సరే విద్యుత్‌ సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌కో రైతులతో ఆటలాడుతోంది. డబ్బులు చెల్లించాం... కనెక్షన్‌ ఇవ్వాలని నిలదీస్తే కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అదనంగా డబ్బు చెల్లించాలంటూ మరోసారి నోటీసులు ఇస్తూ ఆర్థకంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

చేయి తడపకపోతే విద్యుత్‌ కట్‌...!

జిల్లాలో 15900 వ్యవసాయ బోరు కనెక్షలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 12వేలకు పైగా వ్యవసాయ బోరు కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. కొత్తగా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో సుమారు 350 మందికిపైగా రైతులు ఇలా వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా కోసం డీడీలు చెల్లించి ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. మామూళ్లు ఇస్తే తప్ప కనెక్షన్లు గాని, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు గాని ఏర్పాటు చేయడం లేదని రైతులు, వినియోగదార్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది రూపాయలు మామూళ్లు ఇస్తే పనులు మాత్రం చక చకా జరిగిపోతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి డీడీలు చెల్లించి సిబ్బందికి వేలాది రూపాయలు ఇచ్చుకోవడం మా వల్ల కావడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ట్రాన్స్‌కోలో అవినీతి రాజ్యమేలుతోందని వినియోగదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్లు ఇవ్వకపోతే ఏదో రకంగా రైతులను, వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక సాకుతో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement