ఓపీ ఫుల్...
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో ప్రభుత్వ వైద్యం కునారిల్లుతోంది. నిరుపేద రోగికి అండగా నిలవాల్సిన సర్కార్ ఆసుపత్రులు సమస్యల నిలయాలుగా మారాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి మారుమూల సీహెచ్‌సీల వరకు ఎక్కడ చూసినా ‘ఓపీ ఫుల్.. వైద్యం నిల్’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడం, కీలక విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తుండడంతో రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1 డిస్ట్రిక్ట్, 2 ఏరియా, 8 సీహెచ్‌సీ ఆసుపత్రుల్లో ’సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంపై పర్యవేక్షణ కరువైందని..మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగుల అగచాట్లు..
అనకాపల్లి జిల్లా కేంద్రమైన ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా..ఇక్కడ వైద్యం అందడం లేదు. సగటున 400 వరకూ రోగులు ఓపీ నమోదవుతుంది. వైద్యపరికరాలు, మందులు, వీల్ చైర్లు, ఇతర మౌలిక వసతుల లోపం కారణంగా వైద్యులున్నా తగిన వైద్యసేవలందించలేకపోతున్న పరిస్థితి ఎన్‌న్‌టీఆర్ ఆసుపత్రిలో కనిపిస్తోంది. రోజువారీ గంట వరకూ ఓపీలకు క్లోజ్డ్ టైం. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి మధ్యాహ్నం 2 తర్వాత వస్తే.. విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళతారు. ఇక ఉదయమే వచ్చి క్యూలో నిలుచుండి ఓపీలో చూపించుకుని వైద్యుడి సలహా మేరకు వార్డులో చేరితే కాసింత ఎమర్జెన్సీ అయినా తక్షణమే కేజీహెచ్‌కి వెళ్లిపోవాలని రిఫర్ రాసేస్తున్నారు. ఎక్కువగా గైనిక్ రోగులనే చిన్నపాటి ఎమర్జెన్సీ ఉన్నా కేజీహెచ్‌కి రిఫర్ రాసేస్తున్నారు.
‘సాక్షి’ పరిశీలనలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో
వెలుగు చూసిన వాస్తవాలు...ఇలా...
●అనకాపల్లి జిల్లాలో ఏకై క జిల్లా ఆసుపత్రి ఎన్టీఆర్ ఆసుపత్రి. ఇక్కడకు అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి రోగులు వస్తుంటారు.
●ఎన్‌టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 250 నుంచి 300 బెడ్స్ సదుపాయం ఉంది. 250 బెడ్స్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉన్నారు.
●ఆసుపత్రిలో 42 మంది వైద్యులుండాలి. కానీ 32 మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీరిలో 17 మంది సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 15 మంది పీజీ వైద్యులు ఉన్నారు.
●జనరల్ మెడిసిన్‌్ విభాగంలో ముగ్గురికి గానూ ఇద్దరు మాత్రమే ఉన్నారు. గైనిక్ విభాగంలో ముగ్గురు
●పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరూ కూడా లేరు. ఎంసీయూ వార్డులో చిన్న పిల్లల వైద్యులు ఇద్దరు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి.
●అనస్తీషియా వైద్యులు ఇద్దరు ఉండాల్సి ఉంది. వీరిలో ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు
●కంటి వైద్య నిపుణులు ఇద్దరు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు.
●సైకియాట్రిస్ట్ వైద్యులు లేరు
●స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్ 510 మంది (ప్రభుత్వ, అవుట్‌సోర్సింగ్) ఉండాలి. వీరు రెండు షిప్ట్‌లలో విధులు నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం 215 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 56 మంది పనిచేస్తున్నారు.
నక్కపల్లిలో ‘కంటి‘ తుడుపు చర్యలు..
నక్కపల్లి ఏరియా ఆసుపత్రి (50 పడకలు)లో గతంలో కంటే ఓపీ రోగుల సంఖ్య తగ్గింది. నెలకు సగటున 11 వేలకు పైగా ఓపీ ఉండేది. ఇప్పుడు 6 వేలకు తగ్గింది. ఇన్ పేషెంట్‌లు గతంలో 1000 మంది వరకూ ఉండేవారు..అది కాస్త 300కు తగ్గింది. ఈ ఆసుపత్రిలో రెండేళ్లుగా వైద్య నిపుణులు పీడియాట్రిషన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనిక్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంటి వైద్యులు ఉన్నా సేవలు అంతంతమాత్రమే. సిబ్బంది లేక సరైన వైద్యం అందక ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది.
●చోడవరం, మాడుగుల, కోటవురట్ల, యలమంచిలి సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత లేకున్నా..మందుల కొరత ఉంది. ఇన్ పేషెంట్లకు టాయిలెట్ సమస్యలున్నాయి.
జిల్లాలో దయనీయంగా సర్కారు వైద్యం
జిల్లా ఆసుపత్రిలోనూ రోగుల అగచాట్లు
మౌలిక వసతుల లేమితో అవస్థలు
ఎక్స్‌రే, స్కానింగ్ కోసం గంటల పాటు క్యూలైన్లో రోగులు
వైద్యులున్నా వేధిస్తున్న మందుల కొరత
అవసరం లేకున్నా రోగులకు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్
ఎన్టీఆర్ ఆసుపత్రిలో అక్రమాల దందా
జిల్లాలో ఉన్న 1 డిస్ట్రిక్ట్, 2 ఏరియా, 8 సీహెచ్‌సీ ఆసుపత్రుల్లో
‘సాక్షి‘ క్షేత్ర పరిశీలన


