అచ్యుతాపురం రూరల్ : బ్రాండిక్స్ పరిశ్రమ కాలుష్యం కోరల నుండి దుప్పితూరు గ్రామాన్ని కాపాడుకుందామని మంగళవారం చలో దుప్పితూరు విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మశ్రీ నాయకత్వంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ అనకాపల్లి ఎంపీ సత్యవతి, వరుదు కళ్యాణి దుప్పితూరు గ్రామ సమస్యలపై పోరాడేందుకు పాల్గొంటున్న సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి చలో దుప్పితూరు కార్యక్రమం విజయవంతం చేయాలని సోమవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షునిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. దుప్పితూరు గ్రామ రైతుల భూములతో బ్రాండిక్స్ పరిశ్రమ ఏర్పర్చి దశాబ్దాల కాలం గడుస్తున్నా, గ్రామస్తులకు పరిహారం, ప్యాకేజి ఇవ్వకుండా ప్రహరీ నిర్మాణాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. దుప్పితూరులో గ్రామస్తులకు దశాబ్దాల కాలంగా జరుగుతున్న అనేక సమస్యలు, అన్యాయాలపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ధర్మశ్రీ పిలుపునిచ్చారు.


