వడ్డీ రాయితీకి ఎసరు?
వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, అన్నదాతలను అదుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలను మోసం చేస్తోంది. ఎన్నికల ముందు రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి అఽధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల నుంచి రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలకు వడ్డీ రాయితీ చెల్లించడం మానేసింది. దీంతో వడ్డీభారం రైతుల మెడకు చుట్టుకునే పరిస్దితి కనిపిస్తోంది.
సాక్షి, అనకాపల్లి, నక్కపల్లి :
దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ అవసరాల కోసం రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు, తదుపరి రైతులు తీసుకునే రుణాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం 4శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని ప్రకటించారు. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ భరిస్తున్నాయి. రూ.3 లక్షలు రుణాలు తీసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తుంది. 2004 నుంచి ఈ వడ్డీ రాయితీ పథకాన్ని పక్కాగా అమలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా వైఎస్సార్ బాటలోనే రైతులకు వడ్డీ రాయితీ అందజేసింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్ల పాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కారు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ వడ్డీ పథకానికి ఎసరు పెట్టింది. ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పావలా వడ్డీ రాయితీకి సంబంధించి పైసా కూడా విడుదల చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.వెయ్యి కోట్లపైనే బకాయిలు...!
ఉమ్మడి విశాఖ జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 2లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా కనిష్టంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వ్యవసాయ అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల రైతులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రాయితీకి ఎగనామం పెట్టింది. రైతు తన వ్యవసాయ అవసరాల కోసం లక్ష రూపాయలు రుణం తీసుకుంటే సంవత్సరానికి 7 శాతం వడ్డీ అంటే రూ.7వేలు రూపాయలు వడ్డీరూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ వడ్డీభారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కేంద్రం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. అంటే రైతు చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో కేంద్రం భరించాల్సిన 3 శాతం వడ్డీ (రూ.3వేలు) యఽథావిధిగా జిల్లా కేంద్ర సహాకార బ్యాంకుల ద్వారా స్థానిక సహకార సంఘాలకు చెల్లించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 4 శాతం (పావలావడ్డీ, రూ.4వేలు) మాత్రం ఈ 18 నెలల నుంచి జమ కావడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 98 సహకార సంఘాలతో పాటు, డీసీసీబీ బ్రాంచిల ద్వారా రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ కింద దాదాపు రూ.వెయ్యికోట్లు పైనే వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డట్టు సమాచారం. కేంద్ర ప్రభు త్వం చెల్లించే రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రం జమ కానట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొన సాగితే రుణాలు ఇచ్చిన సహకార సంఘా లు, జాతీయ బ్యాంకులు మిగిలిన నాలుగు శా తం వడ్డీని రైతుల నుంచి వసూలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీకి వడ్డీకూడా కలిపి వసూలు చేస్తారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహకార సంఘాలు కూడ నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అన్నదాత సుఖీభవ పథకానికి ఒక ఏడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ రాయితీని కూడా 18 నెలల నుంచి ఎగనామం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఖరీఫ్ సీజన్‌లకు రూ.40వేలు జమ చేయాల్సి ఉండగా కేవలం రూ.14వేలు మాత్రమే జమ చేసింది.
రాయితీ వెంటనే విడుదల చేయాలి
నేను, నా కుటుంబ సభ్యులు కలసి పాయకరావుపేట పీఏసీఎస్‌లో వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.3.50 లక్షలు రుణం తీసుకున్నాం. ప్రతి ఏటా సకాలంలో రుణ వాయిదా చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడం లేదు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్దితి నెలకొంది. బ్యాంకర్లు ఒత్తిడి చేయడంతో పూర్తి వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి వడ్డీ రాయితీ వెంటనే విడుదల చేయాలి.
–రాజేష్‌ఖన్నా, రైతు మంగవరం
కౌలు రైతులకూ రుణ సదుపాయం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తొలిసారిగా కౌలు రైతులకు కూడా రుణ సదుపాయం కల్పించాం. అంతేకాకుండా సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు రాయితీ అందించాం. రూ.లక్ష వరకూ జీరో వడ్డీతోనే వ్యవసాయ రుణాలు ఇచ్చాం. ఆపై తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే..కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం రాయితీ నేరుగా రైతు ఖాతాలోనే జమయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో రాయితీ ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఎన్నికలకు ముందు బూటకపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత జీవో కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఉమ్మడి జిల్లా పరిధిలో వెయ్యి కోట్లు లావాదేవీలుండేవి. 2021–22లో 2 వేల కోట్ల లావాదేవీలు చేయగా.. 2022– 23 ఆర్థిక సంత్సరంలో రూ.2 వేల కోట్లకు పైగా లావాదేవీలు, 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,500 కోట్ల లావాదేవీలు జరిగాయి. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రుణాలను రైతులకు అందించాం. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులకు రుణాలను మంజూరుచేశాం. రైతాంగానికే కాకుండా చిన్న, చిన్న వ్యాపారస్తులకు ముద్రా, స్వయంకృషి పథకాల కింద రుణాలు అందించాం.
– చింతకాయల అనిత, డీసీసీబీ మాజీ చైర్‌పర్సన్.
జిల్లాలో 2024–25లో రూ.730.20 కోట్ల రుణాలు ఇచ్చారు. వీటిలో ఎస్‌ఏవో రుణాలు రూ.31,104 లక్షలు, ఎల్‌టీ రుణాలురూ.41,744 లక్షలు , కౌలు రైతులకు 75 పీఏసీఎస్‌ల ద్వారా రూ. 172 లక్షలు రుణాలు ఇచ్చారు.
జిల్లాలో 2025–26లో రూ.600.66 కోట్ల రుణాలు మంజూరుచేశారు. వీటిలో ఎస్‌ఏవో రుణాలు రూ.16,985 లక్షలు, ఎల్‌టీ రుణాలు రూ.42,894 లక్షలు, కౌలు రైతులకు 75 పీఏసీఎస్ ద్వారా రూ.187 లక్షల రుణాలు ఇచ్చారు.
కేంద్రం వాటా మాత్రమే విడుదల
నిరాశలో అన్నదాతలు
రైతులు సకాలంలో రుణాలు చెల్లించినా
రెండేళ్లలో పైసా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం


