అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్ల పరిశీలన
పరవాడ/అనకాపల్లి: అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ముత్యాలమ్మపాలెం తీరంలో చేస్తున్న ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం మంత్రి ముత్యాలమ్మ పాలెం, అనకాపల్లిలలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అనకాపల్లి ఉత్సవ్‌ను ఈనెల 30, 31 తేదీల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో నాలుగు చోట్ల ఈ ఉత్సవాలను ఏర్పా టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొండకర్లఆవ, ఎన్టీఆర్ స్టేడియం, బెల్లంమార్కెట్, ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం బీచ్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. ఉత్సవాల విజయవంతానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లా ప్రజలు రెండు రోజుల పాటు ఆనందంగా గడపడానికి తీరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎస్పీ తుహిన్‌సిన్హా ఏర్పాట్లను పరిశీలించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రత్యేక పోలీస్ బందోబస్తు
అనకాపల్లి: అనకాపల్లి ఉత్సవ్‌ను పురస్కరించుకుని ఈనెల 30, 31తేదీల్లో జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఉత్సవాలు జరిగే అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానం, ఎన్టీఆర్ బెల్లంమార్కెట్, పరవాడ మండలంలో ముత్యాలమ్మపాలెం, అచ్యుతాపురం మండలంలో కొండకర్ల ఆవ ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సారిగా అనకాపల్లి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఉత్సవాలకు గ్రామీణప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతకుముందు ముత్యాలమ్మపాలెం బీచ్, అచ్యుతాపురంలో కొండకర్ల అవ ప్రాంతాలను పరిశీలించారు. అనకాపల్లి పరవాడ డీఎస్పీలు ఎం.శ్రావణి, వి.విష్ణుస్వరూప్ పాల్గొన్నారు.


