30 నుంచి ఎస్టీయూ దశవారీగా ఆందోళనలు
చోడవరం: ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఐ.వి. రామిరెడ్డి డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఈనెల 30వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళనలు చేస్తామని గురువారం వారు ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ పీఆర్‌సీ కమిషన్ గడువు పూర్తయి 30 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించలేదని తెలిపారు. ఐఆర్ 30శాతం ప్రకటించాలని, పదవీ విరమణచేసిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్ మంజూరుచేయాలని, ఉపాధ్యా య, ఉద్యోగులకు రావలసిన అన్ని సౌకర్యాలు వెంటనే చెల్లించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఏపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 30న అన్ని మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించడం, ఫిబ్రవరి 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, 25న చలో విజయవాడ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎస్టీయూ ప్రధానకార్యదర్శి కె.పరదేశి పాల్గొన్నారు.


