గీతం భూ బాగోతం.. కౌన్సిల్ తలవంచుతుందా?
దీని విలువ రూ.5వేల కోట్ల పైమాటే..
క్రమబద్ధీకరణకు కౌన్సిల్ సమావేశ అజెండాలో ప్రతిపాదన
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న విపక్షాలు
నేటి కౌన్సిల్ సమావేశంలో అడ్డుకోనున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతల నిరసన
54.79 ఎకరాల భూములను చెరపట్టిన గీతం
డాబాగార్డెన్స్: విశాఖ మహా నగరంలో మరో భారీ భూకుంభకోణానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. స్వయానా విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చట్టబద్ధం చేసేందుకు పావులు కదుపుతోంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల భూములను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనను శుక్రవారం జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ అజెండాలో 15వ అంశంగా చేర్చడంపై వైఎస్సార్‌సీపీ, సీపీఎం భగ్గుమంటున్నాయి. ప్రజా ఆస్తులను దోచిపెట్టేందుకు జీవీఎంసీని అడ్డాగా మార్చుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ భూముల బదలాయింపు అంశాన్ని అడ్డుకుంటామని విపక్ష కార్పొరేటర్లు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులతో కలిసి గీతం భూదోపిడీని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.
జీవో 571కి తూట్లు
ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ఎంపీనే, తన అధికార బలంతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భూముల కేటాయింపు, క్రమబద్ధీకరణ ప్రయత్నాలు జీవో నెం. 571కి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదాస్పద అంశాన్ని వెంటనే అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారావు తదితరులు కార్పొరేటర్లతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావుకు, అదనపు కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లోని వివాదాస్పద స్థలాలను స్వయంగా పరిశీలించారు. ఇంతటి భారీ కుంభకోణానికి కౌన్సిల్ వేదిక కావడం సిగ్గుచేటని, కూటమిలోని బీజేపీ, జనసేన నేతలు దీనిపై నోరు మెదపకపోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అజెండా నుంచి ఈ అంశాన్ని తొలగించకపోతే కౌన్సిల్ సమావేశంలోనే గట్టిగా నిలదీసేందుకు సిద్ధమని వైఎస్సార్ సీపీ ప్రకటించింది.
గీతం ’కబ్జా’ భూముల చిట్టా ఇదే..
గీతం విశ్వవిద్యాలయం, ఆసుపత్రి యాజమాన్యం ఆక్రమణలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల వివరాలివి.. ఎండాడ గ్రామ సర్వే నంబర్ 15/1 నుంచి 15/5 వరకు 24.51 ఎకరాలు, 16/4లో 1.95 ఎకరాలు, 17/27లో 1.01 ఎకరాలు, 17/30లో 1.09 ఎకరాలు, 18/2లో 1.03 ఎకరాలు, 20/5లో 5.60 ఎకరాలు, 20/10లో 1.50 ఎకరాలు, 20/12లో 0.10 ఎకరాలు, 191/1లో 0.48 ఎకరాలు, 191/2లో 0.86ఎకరాలు, 191/9లో 0.70 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాల 39 సెంట్లు. రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37/2లో 4.29 ఎకరాలు, 38/1బిలో 7.27 ఎకరాలు, 53/4లో 0.03 ఎకరాలు, 55/3లో 0.35 ఎకరాలు, 61/5లో 0.40 ఎకరాలు, 61/5లో 0.06 ఎకరాలు.. కలిపి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 40 సెంట్లు. ఈ రెండు గ్రామాల్లో కలిపి ఎంపీ శ్రీభరత్ కుటుంబం ఆధీనంలోని గీతం సంస్థల చేతిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలు.
ఇది నీతివంతమైన పాలనేనా?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, నిష్పక్షపాతంగా పాలిస్తానని ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఇలా భూదోపిడీకి పాల్పడటం దుర్మార్గం. అధికార పార్టీ ఎంపీ భూకబ్జాపై కూటమిలోని బీజేపీ, జనసేన తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలి. ఈ దోపిడీని సమర్థిస్తున్నారా? లేదా తప్పని వ్యతిరేకిస్తారా? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే విశాఖలో వేల కోట్ల ప్రభుత్వ భూములను దోచుకోవడమేనా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతి ప్రవచనాలు చెబుతుంటారు. మరి రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూమిని దోచుకోవడం నీతివంతమైన పాలనేనా? దీనికి సమాధానం చెప్పాలి.
– బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్ష నేత


