దూబే మెరిసినా..మ్యాచ్ కివీస్‌దే!
అనకాపల్లి
ఉప్పొంగిన దేశభక్తి
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026
విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బుధవారం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైనప్పటికీ.. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో క్రీడాభిమానులకు మాత్రం కావాల్సినంత వినోదం దక్కింది. ఇరుజట్లు కలిపి ఏకంగా 56 బంతుల్ని బౌండరీకి తరలించగా.. అందులో 22 సిక్సర్లే ఉండటం విశేషం. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ముఖానికి త్రివర్ణ పతాక రంగులు, చేతిలో జాతీయ జెండాలు, ఒంటిపై టీమిండియా జెర్సీలతో అభిమానులు సందడి చేశారు. ఇండియా.. ఇండియా.. అన్న నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగిపోయాయి. గ్యాలరీలన్నీ నీలి రంగు జెర్సీలతో నిండిపోయి, స్టేడియం మొత్తం మరో నీలి సముద్రాన్ని తలపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. వైజాగ్ బ్యాటింగ్ పిచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైజాగ్ వేదికగా జరిగిన ఐదు టీ–20 మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. టిమ్ సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, విశాఖ వేదికగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. రింకూ సింగ్.. నాలుగు అద్భుతమైన క్యాచ్‌లు అందుకొని ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో ఎప్పుడూ పొదుపుగా ఉండే బుమ్రాకు కూడా ఈ మ్యాచ్ కలిసిరాలేదు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తడబడింది. అయితే శివమ్ దూబే క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపం మారింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన దూబే 7 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ముఖ్యంగా కివీస్ బౌలర్ సోధీ వేసిన 12వ ఓవర్‌లో దూబే శివమెత్తాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే 5 బంతులను బౌండరీకి తరలించగా.. అందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో స్టేడి యం మొత్తం దూబే నామస్మరణతో మార్మోగింది. రింకూ సింగ్, సంజూ శాంసన్ మినహా మిగిలిన వారు విఫలం కావడం, కీలక సమయంలో దూబే రనౌట్ కావడంతో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్‌ను భారత్ కై వసం చేసుకోవడంతో, ఈ ఓటమి సిరీస్ ఫలితంపై ప్రభావం చూపలేదు. భారత్ గెలిచి ఉంటే ఆనందం రెట్టింపయ్యేదని అభిమానులు అభిప్రాయపడినప్పటికీ, బౌండరీల మోతతో తమకు కావాల్సిన అసలైన వినోదం దక్కిందని వైజాగ్ వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.
శివమెత్తిన దూబే
భారీ లక్ష్య ఛేదనలో తడబడ్డ టీమిండియా బౌండరీల మోతమోగించిన బ్యాటర్లు
దూబే మెరిసినా..మ్యాచ్ కివీస్‌దే!
దూబే మెరిసినా..మ్యాచ్ కివీస్‌దే!


