దొంగచాటు సర్వేలు
కాగిత నుంచి ఎన్.నర్సాపురం వరకు యంత్రాలతో భూసార పరీక్షలు
రహస్య సర్వేలపై భగ్గుమన్న రైతులు
పనులు అడ్డుకున్న వైనం
తమకు సంబంధం లేదంటున్న అధికారులు
ప్రైవేటు వ్యక్తుల తీరుపై రైతుల్లో ఆందోళన
రైతుల భూముల్లో
అంతా గోప్యం!
నక్కపల్లి : మండలంలో స్టీల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాల్లో రైతులకు తెలియకుండా కొంతమంది యంత్రాలు, రిగ్గులతో పరీక్షలు చేయడంతో పాటు జెండాలు పాతడం చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండా తమ భూము ల్లో 50 నుంచి 100 అడుగులు గోతులు తవ్వేసి భూసార పరీక్షలు చేయడం పట్ల ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లోకి అనుమతి లేకుండా వచ్చి పరీక్షలు చేయడంతో తవ్వకాలు జరుపుతున్న యంత్రాలను, రిగ్గులను కాగిత రైతులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కాగిత నుంచి ఎన్.నర్సాపురం వరకు ఉన్న భూముల్లో కొద్ది రోజులుగా కొంత మంది ప్రైవేటు వ్యక్తులు బోర్లు నిర్మించే రిగ్గులు, సర్వే పరికరాలతో వచ్చి రైతులకు తెలియకుండా వారి భూముల్లో జెండాలు పాతుతున్నారు. 100 అడుగుల లోతున పెద్దపెద్ద గోతులు తవ్వి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీరు ఎవరు? మాకు తెలియకుండా మా భూముల్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన రైతులకు సదరు ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. మండలంలో డీఎల్ పురం, అమలాపురం, రాజయ్యపేట, చందనాడ తదితర గ్రామాల పరిధిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం 2200 ఎకరాలను కేటాయించింది. ఈ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుంది. జాతీయ రహదారి నుంచి కాగిత మీదుగా 100 అడుగుల రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. కాగిత తదితర గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ ఏర్పాటు కోసం అదనంగా భూములు అవసరం ఉంది. 2వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధపడుతుండగా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ గ్రామాల పరిధిలో అనధికారికంగా సర్వే చేయడాన్ని గమనించిన రైతులు కాగిత సర్పంచ్ పోతంశెట్టి రాజేష్, నాయకులు దేవవరపు శివ, గుమ్మిళ్ల జమీల్, వీరబాబు, పోతంశెట్టి బాబ్జి తదితరుల దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో వారంతా అక్కడకు వచ్చి యంత్రాలను, రిగ్గులను వాహనాలను ఆ భూముల నుంచి తీసుకు వచ్చి స్టీల్‌ప్లాంట్ కోసం నిర్మిస్తున్న రోడ్లలో ఉంచారు. తహసీల్దార్, ఏపీఐఐసీ వారిని అడిగితే ఈ సర్వేలు, పరీక్షలతో తమకు సంబంధం లేదని, తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారని, రైతులకు తెలియకుండా వారి ఆమోదం లేకుండా భూముల్లో ఎలా సర్వేలు, పరీక్షలు నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఈ సర్వేలు చేయమన్నారు.. మీరు ఎక్కడ నుంచి వచ్చారో చెప్పే వరకు వాహనాలను కదలనివ్వమని అడ్డుకున్నారు. గట్టిగా నిలదీస్తే తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీకి చెందిన వారమని చెబుతున్నారని నాయకులు తెలిపారు. అయినప్పటికీ రైతుల అనుమతి లేకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా ఇలా ఏకపక్షంగా సర్వేలు, గోతులు తీసి భూసార పరీక్షలు నిర్వహించడం తగదని రైతులు అంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల చర్యల వల్ల తామంతా భయాందోళనలు చెందుతున్నామని వారు తెలిపారు. సంబంధిత అధికారులు వచ్చి రైతులకు ఈ సర్వేలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
దొంగచాటు సర్వేలు


