చేదెక్కిన బెల్లం
అనకాపల్లి అంటేనే గుర్తొచ్చేది తీయటి బెల్లం..అటువంటి బెల్లానికి గిట్టుబాటు ధరలు లేక జిల్లాలో రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. చెరకు సాగు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం, తెగుళ్లు సోకి దిగుమతి తగ్గిపోవడం, అనకాపల్లి మార్కెట్‌లో బెల్లానికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
20 ఏళ్లగా బెల్లం తయారీ
గత 20 సంవత్సరాలుగా బెల్లం తయారు చేస్తున్నాం. గతంలో మేము తయారు చేసిన బెల్లాన్ని అనకాపల్లి మార్కెట్‌కు తరలించే వారం. కనీస మద్దతు ధరలు అందుబాటులో లేకపోవడంతో కుందెల బెల్లం తయారు చేస్తూ స్థానికంగా అమ్మకాలు చేస్తున్నాం. దీనికి తోడు ఆశించిన ఆదాయం వస్తోంది. – సూరిశెట్టి ముసిలినాయుడు,
రైతు, తిమ్మరాజుపేట
కొత్త వంగడాలపై దృష్టి సారించాలి
రైతులు చెరకు సాగుకు సంబంధించి కొత్తరకం వంగడాలపై దృష్టి సారించాలి.తద్వారా ఆశించిన దిగుబడులతో పాటు ఆశించిన ఆదాయం సమకూరుతుంది. చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తాం.
– ఎం.ఆశాదేవి,
వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్
మునగపాక: ఒకవైపు తగ్గుతున్న సాగు విస్తీర్ణం..మరోవైపు తయారు చేసిన బెల్లానికి అనకాపల్లి మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడం వెరసి చెరకు సాగంటేనే రైతులు విముఖత చూపిస్తున్నారు.ఇంటిళ్ల పాదీ ఏడాది పాటు కష్టపడి పనిచేసినా ఆశించిన ఆదాయం లేక రైతులు సతమతమవుతున్నారు. మరో వైపు బెల్లానికి కూడా ఆశించినంత ధర రావడం లేదు.
అనకాపల్లి బెల్లానికి దేశంలోనే గుర్తింపు...
అనకాపల్లి బెల్లానికి భారతదేశంలోనే మంచి గుర్తింపు ఉండేది. పలు రాష్ట్రాల్లో బెల్లం తయారవుతున్నా మంచి రంగు,రుచితో పాటు నాణ్యమైన బెల్లంగా గిరాకీ ఉండేది. అనకాపల్లి మార్కెట్‌కు పలు ప్రాంతాల నుంచి బెల్లం తరలించేవారు.దీనికి తోడు అనకాపల్లి బెల్లం వ్యాపారులు పోటీ పడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు.దేశంలోనే రెండవ అతి పెద్ద బెల్లం మార్కెట్ యార్డుగా అనకాపల్లి మార్కెట్ పేరుగాంచిన విషయం తెలిసిందే.అయితే గత కొన్ని సంవత్సరాలుగా చెరకు సాగు తగ్గిపోవడంతో బెల్లం ఉత్పత్తి కూడా సన్నగిల్లుతూ వస్తోంది.అనకాపల్లి మార్కెట్‌కు వచ్చే బెల్లం ఇతర రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఎగుమతి జరిగేది.నేడు అటువంటి పరిస్థితులు లేవు.
పెరుగుతున్న సాగుఖర్చులతో సతమతం..
అనకాపల్లి మార్కెట్‌కు తరలించే బెల్లానికి సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు చెరకు సాగు ఖర్చులు పెరిగిపోవడం, కూలీల కొరత రైతులను వేధిస్తోంది. కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల నడుమ రైతు దిగాలు చెందుతున్నారు.దిగుబడులతో పాటు బెల్లం ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇంటిళ్లపాదీ కష్టపడినా..
ఎకరా చెరకు సాగుకు సుమారు రూ.60 వేలకు పైగా ఖర్చు అవుతుంది. విత్తనం నాటిన నుంచి బెల్లం తయారు చేసేంతవరకు పలు స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలి. ఎకరా విస్తీర్ణంలో చెరకు సాగు ద్వారా 20 పాకాల వరకు బెల్లం దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం పాకం ధర రూ.3,800 నుంచి రూ.4,100 వరకు ఉంది. ఈ లెక్కన 20 పాకాలకు రూ.76వేల నుంచి రూ.82వేల వరకు ఆదాయం వస్తుంది. ఇంటిళ్ల పాదీ ఏడాది పాటు కష్టపడినా వచ్చే ఆదాయం అరకొరే.
కుందెల బెల్లంపై ఆసక్తి
కుందెల బెల్లం తయారీ ద్వారా పాకానికి 130 కిలోల వరకు బెల్లం తయారవుతుంది. అంటే కిలో రూ.50 చొప్పున చూస్తే రూ.6,500 వరకు పలుకుతుంది. ఈలెక్కన 20 పాకాలకు రూ.1.30 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది.
సాగు తగ్గడానికి కారణాలివే..
తాము పండించిన బెల్లానికి సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై అనాసక్తి చూపుతూ వస్తున్నారు.కనీసం పెట్టుబడులు రాక ఏం చేయాలో తెలియక రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాల్సి వస్తోంది.దీనికి తోడు చెరకు తోటలకు తెగుళ్ల వ్యాప్తి పెరిగిపోవడం దిగుబడులపై ప్రభావం చూపుతోంది. క్వింటాల్‌కు రూ.5వేల మేర మద్దతు ధర ఉంటేనే బెల్లానికి గిట్టుబాటు లభించే పరిస్థితులు ఉంటాయి.లేకుంటే చెరకు రైతు పరిస్థితి దయనీయమనే చెప్పాలి. పలు మార్లు ప్రభుత్వాల దృష్టికి రైతులు తమ గోడు వినిపిస్తూ మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఆదుకుంటున్న కుందెల బెల్లం
అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఆశించిన ధరలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారిస్తున్నారు. స్థానికంగా కుందెల బెల్లం తయారు చేస్తూ కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. రైతుల కమతాల్లో కుందెల బెల్లం తయారు చేయడంతో పాటు తమకు కావాల్సిన సైజుల్లో లభిస్తుండడంతో కొనుగోలు దారులు కూడా వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. పండగల సందర్భాల్లో వారికి కావాల్సిన సైజుల్లో బెల్లం ఆర్డర్లు ఇవ్వడం, వాటిని రైతులు స్థానికంగా తయారు చేయడంతో కొనుగోలు దారులు ముందుకొస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో నాణ్యమైన బెల్లం దొరకడంతో రోజురోజుకూ కొనుగోలు దారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.గతంలో 12 నుంచి 15 కిలోల బరువు ఉండే దిమ్మలు నేడు కిలో, కిలోన్నర మేర దొరుకుతున్నాయి. స్థానికంగా బెల్లం విక్రయాలు జరగడంతో ఆదాయం కూడా బాగుటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడుపోతోంది. మునగపాక,కశింకోట,కె.కోటపాడు తదితర మండలాల్లో రైతులు కుందెల బెల్లం తయారీపై మక్కువ చూపుతున్నారు.
కొత్త వంగడాలను పరిచయం చేయాలి...
చెరకులో తెగుళ్ల బెడద లేకుండా ఉండేందుకు కొత్తరకం వంగడాలను పరిచయం చేయాల్సి ఉంది. రైతులు కూడా వంగడాలను మార్పు చేయాల్సి ఉన్నా వారిలో కూడా ఎందుకో అంతగా ఆసక్తి కనిపించడం లేదనే చెప్పాలి.అధికారులు గ్రామాల్లో రైతులకు కొత్త వంగడాల ద్వారా చేకూరే ఆదాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది.రైతులు కూడా మూఢనమ్మకాలను విడనాడి వ్యవసాయాధికారుల సలహాలు,సూచనలు పాటించాల్సి ఉన్నా ఎందుకో చెరకు రైతుల్లో నిర్లిప్తత కనిపిస్తుందనే చెప్పాలి.మారుతున్న కాలంతో పాటు రైతులు కూడా చెరకు సాగులో కొత్తరకం వంగడాలపై దృష్టి సారించేలా చూడాలని అధికారులు కోరుతున్నారు.
సీజన్‌లో పదిలక్షల దిమ్మలు.. ప్రస్తుతం లక్షకంటే తక్కువే
అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఆశించిన ధరలు లేకపోవడంతో మార్కెట్‌కు వచ్చే దిమ్మల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గతంలో సీజన్‌లో ఒకనెలలో 10లక్షల దిమ్మలు వచ్చేవి. ప్రస్తుతం ఏటా కేవలం 7 లక్షలకు పైగా దిమ్మలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి.వందేళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో బెల్లం రాకపోవడంతో అటు వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే చెప్పాలి.
తగ్గుతున్న చెరకు సాగు విస్తీర్ణం
ఒకప్పుడు చెరకు పంట రైతులను ఆదుకునేది. ఇంటిళ్ల పాదీ కష్టపడి పనిచేయడంతో దిగుబడులు కూడా ఆశాజనంగా ఉండేవి.దీనికి తోడు గతంలో గిట్టుబాటు ధరలు లభించేవి. రానురాను బెల్లం ధరలు తగ్గుముఖం పడడంతో చెరకు సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. అనాదిగా వస్తున్న వ్యవసాయం వదులుకోలేక ఉన్నంతలో చెరకు ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో చెరకు సాధారణ సాగు విస్తీర్ణం14,512 హెక్టార్లు కాగా, 2024లో 5,867 హెక్టార్లలో చెరకు సాగు జరిగింది. 2025లో 3,786 హెక్టార్ల మేర సాగు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఏడాదిలోనే 2,071 హెక్టార్ల మేర చెరకు సాగు తగ్గిందనే చెప్పాలి.
మునగపాక మండలంలో సాధారణ విస్తీర్ణం సాగు విస్తీర్ణం 1,434 హెక్టార్లు కాగా, ప్రస్తుతం 462 హెక్టార్లలో చెరుకు సాగు చేస్తున్నారు.
కశింకోట మండలంలో ప్రస్తుతం 400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
కె.కోటపాడు మండలంలో ప్రస్తుతం 800 ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నారు.
సంక్షోభంలో పరిశ్రమ
అనకాపల్లి మార్కెట్‌లో
అంతంత మాత్రంగానే అమ్మకాలు
గిట్టుబాటు ధరలు లేక రైతుల అవస్థలు
గణనీయంగా తగ్గుతున్న చెరకు ఉత్పత్తి
పెరుగుతున్న పెట్టుబడులతో
అన్నదాతలు సతమతం
చేదెక్కిన బెల్లం
చేదెక్కిన బెల్లం
చేదెక్కిన బెల్లం
చేదెక్కిన బెల్లం
చేదెక్కిన బెల్లం


