17 మందికి మెమోలు
చోడవరం: స్థానిక పంచాయతీ, సచివాలయం–1 సిబ్బందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మెమోలు జారీ చేశారు. ఇన్‌చార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీతారామస్వామి చోడవరం మేజర్ పంచాయతీ కార్యాలయం, సచివాలయం –1 కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది విధుల్లో లేకపోవడంతో మెమోలు జారీ చేసినట్టు ఎంపీడీవో చెప్పారు. పంచాయతీ కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శి శ్రీనివాసరావుతోపాటు బిల్లు కలెక్టర్ లక్ష్మి మాత్రమే తాను పరిశీలనకు వెళ్లిన సమయంలో విధుల్లో ఉన్నట్టు ఎంపీడీవో చెప్పారు. నిబంధనల ప్రకారం ఉదయం 10.30గంటలకు కార్యాలయానికి వచ్చినప్పుడు, 5గంటలకు విధులు ముగించుకుని వెళ్లే టప్పుడు విధిగా హాజరు నమోదు చేయాలన్నారు. అలా కాకుండా సచివాలయం –1లో పనిచేస్తున్న 13 మంది, పంచాయతీ కార్యాలయంలో నలుగురు సిబ్బంది వారికి నచ్చిన సమయంలో విధులకు వచ్చి, వెళ్లిపోయారని, పనివేళల్లో కార్యాలయంలో లేనట్టు తన పరిశీలనలో తేలిందన్నారు. వారికి మెమోలు జారీ చేసినట్టు చెప్పారు. పంచాయతీ, సచివాలయ సిబ్బంది విధిగా పనివేళల్లో కార్యాలయాల్లో ఉండి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సీతారామస్వామి హెచ్చరించారు.


