అధికార పక్షం ఒత్తిడి..అడ్డుగోలుగా అధికారులు
నాతవరం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతల ఒత్తిడితో శనివారం అధికారులు అడ్డుగోలుగా వ్యవహరించడం మండలంలోని లింగంపేటలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కోర్టులో కేసు ఉండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల స్థలంలో పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు పాకలు, కంచె తొలగించేందుకు పోలీసు బందోబస్తుతో ఎంపీడీవో శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు శనివారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల చర్యలను సర్పంచ్ లోకవరపు రాము అడ్డుకున్నారు. తనకు తెలియకుండా భవన నిర్మాణానికి భూమి పూజ ఏవిధంగా చేస్తారని ఆయన ఎంపీడీవోను ప్రశ్నించారు. గ్రామసభ పెట్టి, అందరి ఆమోదంతో పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం ఎంపిక చేద్దామని కార్యదర్శిఽ బుజ్జిబాబుకు చెప్పానని, ఇంతవరకు గ్రామసభ పెట్టలేదని, మాకు తెలియకుండా కూటమి నేతలు చెప్పినట్టుగా కార్యదర్శి నడుచుకుంటూ ఏక పక్ష నిర్ణయం తీసుకుని, మా మధ్య తగాదాలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్థలంలో ఎలాంటి పనులు చేయరాదని సర్పంచ్ భీిష్మించారు. సర్పంచ్, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట పంచాయతీ కార్యాలయానికి నూతన భవననిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, సర్పంచ్ రాముకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి బుజ్జిబాబు... సర్పంచ్ బంధువులైన లోకవరపు మనోజ్, జెమీలు వరహాలబాబు, నూకరాజుల ఆఽధీనంలో ఉన్న స్థలాన్ని ఏక పక్షంగా కేటాయించారు. తర్వాత సర్పంచ్ రాముకు ఈ విషయం తెలియడంతో అక్కడ పంచాయతీ భవనం కట్టవద్దని, వేరొకచోట ప్రభుత్వ స్థలం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ రాము వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కావడంతో అధికారులు ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదు. పంచాయతీ కార్యదర్శి కేటాయించిన స్థలంలో కూటమి నేతలు, ఎంపీడీవో శ్రీనివాస్ ఇతర సిబ్బందితో కలిసి, సర్పంచ్ రాముకు కనీసం తెలియకుండా భవన నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేశారు. ఈనేపథ్యంలో సర్పంచ్ రాము, లోకవరపు మనోజ్, జెమీలు వరహలబాబు, నూకరాజు ఈ స్థలంపై హైకోర్టును ఆశ్రయించి, స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. హైకోర్టులో కేసు ఉండగా కూటమి నేతల ప్రోత్సాహంతో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో స్థలంలో ఉన్న కంచె, పాకలను యంత్రాలతో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వైఎస్సార్‌సీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలు జరగకుండా నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు చర్యలు చేపట్టారు. ఈస్థలంలో మేము ఇళ్లు నిర్మించుకుంటామని, భవనం నిర్మాణానికి మాకు గ్రామంలో ఉన్న జిరాయితీ భూమి ఆరు సెంట్లు ఇస్తామని ఎంపీడీవో ఎస్‌ఐకు స్థలయజమానులు తెలిపారు. ఎస్‌ఐ తారకేశ్వరరావు, తహసీల్దార్ వేణుగోపాల్ ఇరువర్గాల వారికి నచ్చజెప్పి, కొత్తగా ఏర్పాటు చేసిన కంచెలో కొంత భాగం తొలగించేలా అంఽగీకారం కుదుర్చారు. మిగతా స్థలం విషయంపై ఈనెల 19న విచారణ జరుపుతామని తెలిపారు. సోమవారం రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో సమస్య పరిష్కారమయ్యే వరకు పోలీసు బందోబస్తు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ ఎస్‌ఐ రామారావు, ఆర్‌ఐ నాగరాజు, వీఆర్వో మాకిరెడ్డి, చలపతి పంచాయతీ కార్యదర్శి బుచ్చియ్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్యంగా
కక్షసాధింపు చర్యలు
సర్పంచ్‌కు తెలియకుండా, గ్రామసభ లేకుండా పంచాయతీ భవనానికి
స్థలం కేటాయింపు
హైకోర్టులో కేసు ఉండగా
స్వాధీనానికి యత్నం
కార్యదర్శి ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ, కూటమి నేతల
మధ్య వాగ్వాదం
లింగంపేటలో ఉద్రిక్తత
అధికార పక్షం ఒత్తిడి..అడ్డుగోలుగా అధికారులు
అధికార పక్షం ఒత్తిడి..అడ్డుగోలుగా అధికారులు


