నేత్ర పర్వంగా వెంకన్న గిరిప్రదక్షిణ
నక్కపల్లి: పాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వెంకన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం నేత్ర పర్వంగా జరిగింది. దశావతారాల్లో పదో అవతారమైన కల్కి అవతారంలో స్వామివారు స్వయం వ్యక్తమై కొలువుదీరిన గరుడాద్రి చుట్టూ ఈ కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహిస్తారు. ధనుర్మాసోత్సవాలు ముగిసిన అనంతరం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడంతో కనుమ నాడు గిరి ప్రదక్షిణ జరుపుతారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని పుణ్యకోటి వాహనంపై అధిష్టింపజేసి గరుడాద్రి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచిన వాహనాన్ని మోసేందుకు వందలాది మంది భక్తులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి ముందు ఆలయ అర్చక బృందం స్వామి వారికి నిత్యార్చనలు, బాలభోగనివేదన, రాజభోగనివేదని, విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను కడియం నుంచి తెచ్చిన పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. నక్కపల్లి, ఉపమాక, అడ్డురోడ్డు పరిసరప్రాంత గ్రామాలనుంచి వచ్చిన వేలాది మంది గోవింద నామస్మరణ చేస్తూ గరుడాద్రి చుట్టూ తిరిగారు. ఉపమాక శ్రీనివాస భక్తసమాజం సభ్యులు భజనగీతాలు ఆలపించారు. అనంతరం బందుర సరస్సు వద్ద ఉన్న మండపంలో స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం కరి మకర సంవాదం కార్యక్రమం జరిగింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా మకరికి మోక్షం కలిగించే సన్నివేశాన్ని ఆలయ ప్రధానార్చకులు భక్తులకు వివరించారు. తదుపరి స్వామివారికి రాజభోగ నివేదన, తిరువారాధన, తీర్థగోష్టి, ప్రసాద వినియోగం జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడి అరటి గెలలు స్వామివారికి కానుకగా సమర్పించుకోవడం విశేషం. ఇలా వచ్చిన అరటిగెలలను భక్తులకు వెంటనే పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఉపమాకలో పెద్ద తిరునాళ్లు జరిగాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు, పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉపమాక, సారిపల్లిపాలెం, పెట్టుగోళ్లపల్లి, మనబానవానిపాలెం, జానకయ్యపేట, తదితర గ్రామాలనుంచి తోడపెద్దులను తీసుకువచ్చి చెట్టుభజనలు నిర్వహించారు. పలు గ్రామాల కళకారులు తప్పెటగుళ్ల ప్రదర్శనలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమాల్లో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు సంకర్షణపల్లి కష్ణమాచార్యులు, పీసపాటి వెంకటశేషాచార్యులు, గోపాలాచార్యులు, నల్లాని చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, నరసింహాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపమాకకు పోటెత్తిన భక్తజనం


