నిజాయితీని చాటుకున్న స్వాతి
దొరికిన బంగారాన్ని బాధితునికి అందించిన స్వాతిని సత్కరిస్తున్న దృశ్యం
మునగపాక: పరాయి వస్తువులు దొరికితే వాటిని తస్కరించే రోజులివి. అటువంటిది ఓ యువతి తనకు దొరికిన బంగారు ఆభరణం బాధితునికి అందించి నిజాయితీ చాటుకుంది. ఈ సంఘటన మండలంలోని మంగళవరపుపేటలో చోటు చేసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 14న మంగళవరపుపేటలో తీర్థం నిర్వహించారు. ఈ తీర్థానికి విచ్చేసిన మునగపాకకు చెందిన ఆడారి భరద్వాజ్ తన నాలుగు తులాల బంగారు బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవరపుపేట గ్రామానికి చెందిన పాల సంఘ వేతన కార్యదర్శి గొల్లవిల్లి సత్యనారాయణ కుమార్తె స్వాతికి బ్రాస్‌లెట్ దొరికింది. దాన్ని సంబరాల నిర్వాహకులకు అందజేసింది. దీంతో నిర్వాహకులు ఆమె నిజాయితీని మెచ్చుకొని సత్కరించారు.


