అప్పన్న మకరవేట రేపు
సింహాచలం: కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మకరవేట(గజేంద్రమోక్షం) ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపదల్లో ఉన్నవారెవరైనా పిలిచిన వెంటనే ఏదొక రూపంలో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని, మొసలి బారిన పడిన గజేంద్రుడి చరిత్రే దానికి నిదర్శనమని చాటిచెబుతూ ఏటా ఈ ఉత్సవాన్ని కనుమపండుగ రోజు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వరదరాజస్వామి అలంకరణ చేసి శుక్రవారం సాయంత్రం సింహగిరి నుంచి కొండదిగువకి మెట్లమార్గం ద్వారా తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని వేంజేపచేసి గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్టిస్తారు. తదుపరి అడవివరం గ్రామ పురవీధిల్లో గజవావానంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని పూలతోటను ముస్తాబు చేశారు. పూలతోటలోని శ్రీకృష్ణకొలను, స్వామి వేంజేసే ప్రధాన మండపానికి విద్యుద్దీపాలంకరణ చేశారు. కాగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి.
అప్పన్న మకరవేట రేపు


