అర్ధరాత్రి ఆవుల తరలింపు
అడ్డుకున్న పోలీసులు
స్టేషన్ ఆవరణలో ఆవులు ఉన్న వ్యానులు
ఆరిలోవ(విశాఖ): విజయనగరం జిల్లా నుంచి విశాఖ నగరానికి అక్రమంగా తీసుకొస్తున్న గోవులను ఆరిలోవ పోలీసులు పట్టుకున్నారు. ఐదు వ్యానుల్లో తరలిస్తున్న 41 ఆవులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతం నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదు వ్యానుల్లో ఆవులను విశాఖకు తీసుకొచ్చేందుకు బయలుదేరారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు జాతీయ రహదారిపై డెయిరీఫారం వద్ద ఆ వాహనాలను అడ్డుకున్నారు. విచారణలో భాగంగా.. వీటిని నగరంలోని ఏవీఎన్ కాలేజీ, ఆరిలోవ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యానులతో పాటు 41 ఆవులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోవులను విజయనగరం జిల్లా గుజ్జంగివలస గోశాలకు అప్పగిస్తామని, బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


