ఆకట్టుకున్న గుర్రపు స్వారీ పోటీలు
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం జంపపాలెంలో నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గుర్రపు స్వారీ పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గ్రామ శివార్లలో పంట పొలాల్లో కొలువుదీరిన నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 గుర్రాలు పోటీల్లో పాల్గొనగా.. గుర్రాలన్నీ దౌడు తీశాయి. ఈ దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోటీల్లో యలమంచిలి మున్సిపాలిటీ సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు జగదీష్ అశ్వం మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. చోడవరం మండలం అంకంపాలెం మోదమాంబ గుర్రం రెండో స్థానం, విజయనగరం జిల్లాకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం మూడో స్థానం, అచ్యుతాపురం మండలం రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక అశ్వం 4వ స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జంపపాలెం సర్పంచ్ దేవకినాయుడు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పొలమరశెట్టి వెంకట్, లోకేష్, జగది, సోమునాయుడు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకు ముందు తీర్థంలో భాగంగా భారీ అన్నసంతర్పణ నిర్వహించారు.


