నేత్రపర్వంగా గోదా కల్యాణం
నక్కపల్లి : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం భోగినాడు ఉపమాకలో గోదాదేవి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి శ్రీరంగనాధున్ని వివాహమాడడం కోసం నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. నెలరోజుల పాటు చేసిన దీక్షలో తన అనుభూతులను, అనుభవాలను పాశురం రూపంలో రచించి శ్రీరంగనాదుడికి సమర్పించింది. ఈ దీక్ష భోగి పండగతో ముగిసి స్వామివారిని వివాహమాడింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టు ముక్కల వరప్రసాద్ అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, పివి శేషాచార్యులు స్వామివారి పుష్ప తోటలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం కొండపై మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. కొండ దిగువన క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, స్వామివారి ఉత్సవ ఉత్సవమూర్తులకు, ఆండాళ్లమ్మవారిని అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం 30వ పాశురం విన్నపం చేసి,స్వామివారి పుష్పతోటలో గోదాదేవి కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పరిష్యత్, రక్షాబంధనం, కల్యాణమండప బలిహరణ, యజ్ఞోపవేతధారణ, రుత్విక్వరుణ (స్వామివారికి అనువైన కన్యకోసం 8 మంది పెద్దలు వెతికే ఘట్టం) నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాద ప్రక్షాళన, కన్యాదానం, కట్నాలు, శుభ ముహూర్తం, మంగళసూత్రధారణ, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆళ్వారు, ఎంబీరుమాళ్వారులకు తాంబూలం, సభా తాంబూలం సమర్పించారు. నీరాజన మంత్రపుష్పం అనంతరం తీర్థగోష్టి, ప్రసాద వినియోగంతో గోదాదేవి కల్యాణం ముగిసింది. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేతుడైన స్వామివారిని పుణ్యకోటి వాహనంలోనూ, అమ్మవారిని ఇత్తడి సప్పరం వాహనంలో ఉంచి తిరువీధుల్లో ఊరేగించారు.
కల్యాణ కాంతులీనుతున్న స్వామివారు మాడవీధుల్లోకి రావడంతో భక్తులు, కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. టీటీడీ వారు భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసారు. ఈకార్యక్రమాల్లో అర్చక స్వాములు రాజగోపాలచార్యులు, బాగవతం గోపాలాచార్యులు, ఎన్‌సిహెచ్ శ్రీనివాసాచార్యులు, తరిగొండ వేంగమాంబ సాహిత్యపీఠం వ్యవస్దాపకురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి, శ్రీనివాస భక్త సమాజం సభ్యులు పాల్గొన్నారు.
కల్యాణ కాంతులీనుతున్న గోదాదేవి అమ్మవారు, శ్రీరంగనాథుడు
స్వామివారిని పుణ్యకోటి వాహనంలో తిరువీధి సేవ
నేత్రపర్వంగా గోదా కల్యాణం
నేత్రపర్వంగా గోదా కల్యాణం


