తొలిపంట
అప్పన్నకు
భక్తులతో కిక్కిరిసిన సింహగిరి
సింహాచలం: భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి తొలిపంటలను కానుకగా సమర్పించారు. వరిదుబ్బులు, బియ్యం, కూరగాయలు, నూనె, పాలు, పెరుగు, వెన్న, పంచదార, పప్పుదినుసులను భక్తిశ్రద్ధలతో స్వామికి కానుకగా ఇచ్చారు. కరువుకాటకాలు రాకుండా, ఏటా తమ పొలాలు పచ్చగా పండాలని స్వామిని వేడుకున్నారు. అలాగే, పలువురు గ్రామీణ ప్రాంతాల భక్తులు గరిడీ బృందాలతో తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ఎటుచూసినా సింహగిరి భక్తజనసంద్రంగా మారింది. దర్శన క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసాయి. ప్రసాద విక్రయశాల, అన్నప్రసాదశా00లలు భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరిపైన, ఘాట్‌రోడ్డులోనూ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీని వల్ల పలుమార్లు పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే లఘు దర్శనాన్ని కల్పించారు.


