మాజీ సైనికుల సేవలు మరువలేనివి
ఘనంగా 10వ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవం
మహారాణిపేట: దేశ రక్షణలో అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ నగరంలో 10వ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వద్ద వైజాగ్ నావల్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్(డీజీ) కె.శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. త్రివిధ దళాలకు చెందిన సీనియర్ మాజీ సైనికులు, అధికారులతో కలిసి ఆయన అమరవీరులకు అంజలి ఘటించారు. సైనికుల నిస్వార్థ సేవను, దేశం కోసం వారు చేసిన అత్యున్నత త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మాజీ సైనికులతో డీజీ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


